ఏడాదిగా బ్యాంకులో జమకాని సొమ్ము....
స్కాంకు యానిమేటర్ ఒక్కరే బాధ్యులా?
ఈమె వెనుక ఉన్న పెద్దలెవరు
అధికారులు, నాయకుల హస్తం లేకుంటే చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు
బాధిత డ్వాక్రా మహిళలకు న్యాయం చేసేదెవరు
మూడుసార్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టినా చర్యలు తీసుకోరా
ఎలక్షన్ కోడ్‌తోనే చర్యల్లో జాప్యం
డ్వాక్రా మహిళల
అచ్చంపేట: స్థానిక వెలుగు కార్యాలయంలో అవినీతి కోరలు శ్రుతిమించుతున్నాయి. లక్షలాది రూపాయలు అపహరణకు గురవుతున్నా చర్యలు తీసుకోవడంలో ఇటు పాలకులు, అటు అధికారులు నిర్లక్ష్య ధోరణి అనుసరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెలుగులో ఓ చిరుద్యోగి యానిమేటర్ ఎవ్వరి హస్తం లేకుండానే అచ్చంపేట గ్రామ సమైఖ్యలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు పొదుపుచేసుకున్న సొమ్ము, రుణాలు తాలుకా రికవరీ చేసిన సొమ్ము రూ.50 లక్షలకు పైగా స్వాహా చేయడాన్ని ఏమనాలి? మూడునెలల పాటు వరుసగా రీపేమెంటు చేయకపోయినా, నెలనెలా పొదుపు సొమ్ము ఖాతాలో జమకాకపోయినా ఆ అకౌంటును విత్ హెల్డ్‌లో పెట్టే బ్యాంకు వారు ఏడాదిగా వాయిదాలు చెల్లించకపోయినా సంబంధిత గ్రూపులకు ఎందుకు నోటీసులు ఇవ్వడంలేదు, సుమారు ఏడాది తరువాత తమకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని గ్రూపు సభ్యులు తెలుసుకునేవరకు విషయం బయటకు పొక్కలేదంటే ఇందులో ఎవరి పాత్ర ఎంత? ఎవరి వాటా ఎంత అనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు, పాలకులు ఎందుకు తాత్సార్యం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో మాదిపాడు, చింతపల్లి, మరికొన్ని గ్రామసమైఖ్యలలో కూడా ఈ విధమైన దారుణమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. లక్షలాది రూపాయలకు లెక్కలు తేలకపోయినా ఏవిధమైన చర్యలు లేకపోవడంతోనే తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలూ లేకపోలేదు.
గ్రామసమైఖ్య సంఘంలో....
అచ్చంపేట గ్రామసమైఖ్యకు చెందిన శివసాయి, జాని, ప్రియాంక, మక్కామదీనా, అజ్మత్, తిరుమల అనే పొదుపు సంఘాలు స్థానిక స్టేట్ బ్యాంకులో లింకేజీ రుణాలు తీసుకున్నారు. ఒక్కొక్క గ్రూపు రూ. లక్ష నుంచి రూ.12లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలను ప్రతి నెలా వాయిదాల రూపంలో బ్యాంకులో జమచేయాలి. అయితే బ్యాంకుకు, డ్వాక్రా గ్రుపూ సభ్యులకు మధ్య అనుసంధాన కర్తగా యానిమేటర్ ఉంటారు. అచ్చంపేట గ్రామసమైఖ్యకు షేక్ సల్నా అనే మహిళ యానిమేటర్‌గా వ్యవహరిస్తారు. ఈమె బ్యాంకులో గ్రూపు సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే విధంగా సభ్యులకు అవగాహన కల్పించి, మసూలు చేసిన సొమ్మును బ్యాంకులో ప్రతి నెలా జమచేయాలి. అలానే సభ్యులు ప్రతినెల బ్యాంకులో పొదుపుచేసుకునే సొమ్ము కూడా వసూలు చేసి బ్యాంకులో వేయాలి. ఇందులో సభ్యుల తరపున యానిమేటర్ బ్యాంకు లావాదేవీలు నడుపుతారు.
యానిమేటర్‌పై చర్యలేవీ....
రెండు సార్లు బాధిత మహిళా పొదుపు సంఘాల వారు రోడ్డెకి తమ నిరసనలు తెలిపినా, ఆందోళనలు చేపట్టినా, ధర్నాలు చేసినా ఎంతమాత్రం చర్యలు లేవంటే ఇది కచ్చితంగా బడా నాయకులు హస్తం ఉండే ఉంటుందని బాదిత సభ్యులు అనుమానిస్తున్నారు. వీళ్లు చేసిన పని వల్ల మహిళలకు అసలు రుణాలే లేకుండా పోయాయి. గతంలోనే యానిమేటర్లు, సీసీలు, ఏపీఎంలు చేసిన పనుల వల్ల వెలుగు కార్యాలయం ద్వారా వచ్చే రుణాలు మొత్తం ఆగిపోయాయి. సీ్త్ర నిధి బ్యాంకు రుణాల ఊసేలేదు. ఒక్క లింకేజీ రుణాలు తప్ప మిగతా అన్ని రుణాలు ఆగిపోయాయి. ఇప్పుడు యానిమేటర్ సల్మా, ఆమెకు సహకరించిన అధికారులు, నాయకుల పుణ్యమా అంటూ లింకేజి రుణాలు కూడా ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికై నా అధికారులు నష్టపోయిన మహిళా సంఘాలకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
ఏడాది కాలంగా గ్రూపు సభ్యుల నుంచి వసూలు చేసిన రుణాల తాలూకా వాయిదాలు, పొదుపు రూపంలో వసూలు చేసిన సొమ్ము బ్యాంకులో జమా కావడం లేదనే విషయాన్ని సభ్యులు ఈ ఏడాది ఆగస్టులో తెలుసుకున్నారు. వెంటనే వెలుగు కార్యాలయానికి వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో గత సెప్టెంబరు 1వ తేదిన బాధిత మహిళలంతా వెలుగు కార్యాలయం ముందు ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. మండల స్థాయి అధికారులు సభ్యులను శాంతింపచేసి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారం, పది రోజులలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. యానిమేటర్ సల్మా గత నెల రోజులుగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆమె ఆచూకీ తెలుసుకోవడంలోనూ అధికారులు విఫలమయ్యారు. నెల రోజులైనా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తిరిగి అక్టోబరు 8వ తేదీన వెలుగు కార్యాలయం ముందు ఆందోళన ఆందోళన చేపట్టారు. వీరికి ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా మద్దతు పలికారు. వెలుగు ఏపీఎం వచ్చి ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళతాను కాస్త ఓపిక పట్టండి అని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా బాధితులు ఆందోళన విరమించక పోవడంతో పోలీసుల ద్వారా చెదరుగొట్టారు.
అచ్చంపేట గ్రామసమైఖ్య యానిమేటర్ షేక్ సల్మాపై అనేక ఆరోపణలున్నమాట వాస్తవం. మా లెక్కల ప్రకారం సుమారు రూ.25లక్షల వరకు పొదుపు సంఘాల సొమ్ము వాడుకున్నట్లు తెలుస్తోంది. విషయాన్ని ఉనతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారులు దీనిపై విచారణ వేశారు. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా విచారణ వాయిదా పడింది. కచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి పొదుపు సంఘాలకు న్యాయం చేస్తాం.
– వెంకటరెడ్డి, ఏపీఎం, అచ్చంపేట


