ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన
కట్టంగూర్: ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జొన్నలగడ్డ వాసు(22), అతడి బంధువు జొన్నలగడ్డ ప్రశాంత్ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లి సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం వారిద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గంమధ్యలో నార్కట్‌పల్లి వద్దకు రాగానే నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గోగుల స్వాతి(30) లిఫ్ట్ అడగటంతో ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోని చెర్వుఅన్నారం బస్‌స్టాప్ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాసు, స్వాతి అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్‌ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రశాంత్‌ను చికిత్స నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. మృతురాలు స్వాతి భర్త హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తుండగా.. ఆమె టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


