నరసరావుపేట రూరల్: ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడే ముఠాను నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 13 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నర సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.హనుమంతరావు కేసు వివరాలను వెల్లడించారు. మండలంలో ద్విచక్ర వాహనాల వరుస చోరీలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుల వివరాలు లభ్యమైనట్టు తెలిపారు. ముగ్గురు నిందితులు ముఠాగా ఏర్పడి ఇళ్లు, దుకాణాలు, టీ స్టాల్స్ ఎదటు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడ్డారని వివరించారు. నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులు ఉన్నట్టు తెలిపారు. రావిపాడు రోడ్డు టీ టైమ్ వద్ద స్కూటీని చోరీ చేసి నకరికల్లులో విక్రయించేందుకు వెళ్తుండగా నిందితుడు వంగా మహేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మహేష్‌రెడ్డిని విచారించగా నరసరావుపేట మండలం, తాడేపల్లిలో 13 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్టు అంగీకరించారని, వాటిని రికవరీ చేసినట్టు చెప్పారు. బుల్లెట్, పల్సర్ బైక్‌లతో స్కూటీలో ఇందులో ఉన్నాయని తెలిపారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.10 లక్షలు ఉంటుందన్నారు. కేసులో ప్రతిభ కనభర్చిన రూరల్ ఎస్‌ఐలు కిషోర్, ఫిరోజ్ ఫాతిమా, సిబ్బంది ఎం.నాగరాజు, బి.మహేశ్వరరావు, కె.రమేష్‌లను అభినందించారు. సమావేశంలో రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు పాల్గొన్నారు.


