నివాళి అర్పించిన ఎస్పీ జగదీష్ అదహళ్లి
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు శాఖకు విశేష సేవలందించిన రిటైర్డ్ ట్రాకర్ డాగ్ గని సోమవారం మృతిచెందింది. కొంత కాలంగా గని అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో గనికి జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరిలు నివాళులర్పించారు. 2014లో పోలీసు శాఖలో చేరిన గని 2015లో శిక్షణ పూర్తిచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా 239 కేసులకు సంబందించి ట్రాకింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. గత ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందిన గని తరువాత కూడా పోలీసు శాఖతో అనుబంధాన్ని కొనసాగించింది. గని అందించిన సేవలు, చూపిన విశ్వాసాన్ని, అంకితభావాన్ని పోలీసు శాఖ ఎల్లప్పుడూ గుర్తించుకుంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసు లాంఛనాలతో గని అంత్యక్రియలు పూర్తిచేశారు.
బోల్తా పడిన లారీ ట్యాంకర్
పిడుగురాళ్ల: లారీని ఓవర్ టేక్ చేయబోయి రోడ్డు మార్జిన్ దిగటం వలన ట్యాంకర్ లారీ ఫల్టీలు కొట్టి ప్రమాదానికి గురైన ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రోడ్డులో సోమవారం జరిగింది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ లారీ పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్‌లో ఉన్న డైయిన్ అండ్ ప్లే హోటల్ ఎదురుగా మరో లారీని ఓవర్ టేక్ చేసిన తర్వాత రోడ్డు మార్జిన్ ట్యాంకర్ లారీ దిగటంతో అదుపుతప్పి ట్యాంకర్ లారీ మూడు ఫల్టీలు కొట్టింది రోడ్డు పక్కన పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఈపూరు:ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని దుష్మన్‌పేట తండాకు చెందిన మేరాజ్యోత్ ఏడుకొండలునాయక్ (35) మృతి చెందగా, దేశావత్‌బాలునాయక్‌కు గాయాలైనట్లు బంధువులు తెలిపారు. మేరాజ్యోత్ ఏడుకొండలు, దేశావత్ బాలునాయక్‌లు వినుకొండలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తారు. అదే రెస్టారెంట్‌లో పని చేసే మిత్రుడి ఆహ్వానం మేరకు ప్రకాశం జిల్లా కుంట సమీపంలో జరిగే వేడుకకు ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా త్రిపురాంతకం సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఏడుకొండలునాయక్ ముక్కుకు, మెడకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలునాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తండాకు తరలించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని మేకలు మృతి
గురజాల: లారీ ఢీకొని మేకలు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన చిన్నయ్య , శ్రీను, కేశవులుకు చెందిన మేకల మందను పల్నాడు జిల్లాకు మేతకు తీసుకొచ్చారు. గురజాలలోని పెద్దకాలువ వద్ద సోమవారం రాత్రి నీటిని తాగి రోడ్డు దాటుతుండగా మద్యం లోడుతో పాలువాయి గేటు వైపు వెళ్తున్న లారీ వెనుకనుంచి వచ్చి మేకల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారుగా 30కి పైగా మేకలు మృతి చెందగా, మరో 20కి పైగా మేకలు తీవ్ర గాయాలపాలయ్యాయి. వీటితో పాటు గొర్రెలకాపరి కేశవులు కాలుకు గాయమైంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారుగా రూ.7లక్షలకు పైగా ఉంటుందని కాపరులు తెలిపారు.


