జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి రెండు రౌండ్లలోనే తేలనున్న విజేతలు నాలుగు మున్సిపాలిటీల్లో పోలైన ఓట్లు 1,65,418 మధ్యాహ్నం లోగా వార్డు కౌన్సిలర్ల ఫలితాలు తేలనున్న చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థుల భవితవ్యం గెలుపోటములపై బెంగతో అభ్యర్థులకు నిద్ర కరువు
జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఇవే..
సత్తెనపల్లి: జిల్లాలో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితం మరికొద్ది గంటలోనే వెలువడనుంది. విజేతలు ఎవరో పరాజితులు ఎవరో తేలిపోనుంది. జిల్లాలో మున్సిపల్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరగక మాచర్లలో 23వ వార్డుకు సోమవారం రీపోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలై మధ్యాహ్నం 2గంటల వరకు ఫలితాలు తేలిపోనున్నాయి. జిల్లాలోని 4 మున్సిపల్ చైర్మన్ స్థానాలకు, 156 వార్డు కౌన్సిలర్ స్థానాలకుగాను చిలకలూరిపేటలో 16, సత్తెనపల్లిలో ఒకస్థానం ఏకగ్రీవమయ్యాయి. అవి పోను 139 వార్డు కౌన్సిలర్ స్థానాల ఫలితాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సత్తెనపల్లిలో అత్యధికం.. మాచర్లలో అత్యల్పం
జిల్లాలో మొత్తం 427 మంది (4 చైర్‌పర్సన్ పదవుల కోసం 30 మంది, 139 వార్డు కౌన్సిలర్ పదవులకు 397 మంది) భవితవ్యం నేడు తేలనుంది. నాలుగు మున్సిపాలిటీల్లో 139 వార్డుల్లో ఏర్పాటు చేసిన 308 పోలింగ్ కేంద్రాల్లో 2,28,456 మంది ఓటర్లు ఉండగా.. 1,65,418 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 72.40 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సత్తెనపల్లిలో 76.17 శాతం నమోదవగా.. అత్యల్పంగా మాచర్లలో 66.95 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు మంగళవారం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య శిక్షణ పొందిన సిబ్బందితో పకడ్బందీగా కౌంటింగ్ జరగనుంది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా నాలుగు చోట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 1న పోలింగ్ పూర్తయినప్పటి నుంచి అభ్యర్థులకు కంటి నిండా కునుకు లేకుండా ఫలితాలపై ఆత్రుతతో ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రధాన పార్టీల్లో లెక్కలు మొదలయ్యాయి.
ఒక్కో రౌండ్‌కు మూడు గంటలు
స్ట్రాంగ్ రూమ్ నుంచి ర్యాండమ్‌గా బ్యాలెట్ బాక్స్‌లను తీసుకొస్తారు. మొదట ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లు, పోలింగ్ ఆఫీసర్ డైరీలో పేర్కొన్న ప్రకారం మొత్తం ఓట్లు, బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లు సమంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటారు. బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఓట్లు రికార్డుల్లో ఉన్న ప్రకారం రెండు సమానంగా ఉన్నప్పుడే పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు మొదలవుతుంది. బ్యాలెట్ పత్రాలను అభ్యర్థుల గుర్తులు, నోటా వారీగా ట్రేలో వేరు చేస్తారు. ఏవైనా చెల్లని ఓట్లు ఉంటే ఆర్వో నిర్ణయం ప్రకారం ఓటు పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఒక్కో ట్రే నుంచి బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలు కడతారు. అలా మొత్తంగా ఒక్కో రౌండ్‌కు 1000 చొప్పున ఓట్లను లెక్కిస్తారు.జిల్లాలో అధిక ఓట్లు ఉన్న చిలకలూరిపేట పట్టణంలోని వార్డులకు ఒక టేబుల్‌కు రౌండ్‌కు వెయ్యి ఓట్లు,మిగతా చోట్ల ప్రతి రౌండ్‌కు వార్డులో పోలైన మొత్తం ఓట్లను లెక్కిస్తారు.కనీసం మూడు గంటలు పట్టే అవకాశం ఉంది. ఉదయం 11 గంట లకు మొదటి ఫలితం రానుంది. వార్డు కౌన్సిలర్లుకు సంబంధించి తొలుత చిలక లూరిపేట ఫలితం వచ్చే అవకాశం ఉంది.
చిలకలూరిపేట: ఏఎంజీ జూనియర్ కళాశాల
వినుకొండ: లయోలా హైస్కూల్
సత్తెనపల్లి: హోలీఫ్యామిలీ ఇంగ్లిష్ మీడియం పాఠశాల
మాచర్ల: కిట్స్ పాఠశాల
జిల్లాలో కౌంటింగ్ సిబ్బంది వివరాలు
మున్సిపాల్టీ వార్డులు సూపర్ అసిస్టెంట్లు టేబుళ్లు రౌండ్లు
వైజర్లు
చిలకలూరిపేట 32 23 46 23 02+02
వినుకొండ 36 18 36 18 02+02
మాచర్ల 36 18 36 18 02+02
సత్తెనపల్లి 36 18 36 18 02+02
మొత్తం 140 77 154 77 08+08
జిల్లాలో ఓటర్ల వివరాలు
మున్సిపాల్టీ మొత్తం పోలైన పోస్టల్/సర్వీస్ ఓటర్లు ఓట్లు ఓటర్లు
చిలకలూరిపేట 86,554 60,741 47
వినుకొండ 47,186 36,719 56
మాచర్ల 46,520 31,145 68
సత్తెనపల్లి 48,196 36,813 62
మొత్తం 2,28,456 1,65,418 233


