వినుకొండలో ముస్లిం యువకుల నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

వినుకొండలో ముస్లిం యువకుల నిర్బంధం

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

వినుకొండలో ముస్లిం యువకుల నిర్బంధం

అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించిన ముస్లిం మహిళలు

వినుకొండ:ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 14 మంది వైఎస్సార్‌ సీపీ ముస్లిం యువకులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి నిర్బంధించారు. దీంతో భారీ సంఖ్యలో ముస్లిం మహిళలు, పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబసభ్యులు అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 14 మంది యువకులను బొల్లాపల్లి స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇస్తారనే సమాచారంతో పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో పోలీస్‌స్టేషన్‌ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. తమ వారిని ఎందుకు అరెస్టు చేశారు..? ఏం నేరం చేశారు అంటూ మహిళలు పోలీసులను నిలదీశారు. తమ వారిని విడిచి పెట్టేంత వరకూ పోలీస్‌స్టేషన్‌ నుంచి కదలబోమని ముస్లిం మహిళలు భీష్మించి అర్ధరాత్రి అయినా స్టేషన్‌ ముందే బైఠాయించారు. ఎక్కడో ఇద్దరు ఆటోడ్రైవర్లు మద్యం మత్తులో కొట్టుకుంటే సంబంధం లేని కేసులో తమ వారిని ఇరికించారని మహిళలు ఆరోపించారు.

యువకుల అరెస్టును ఖండించిన బొల్లా....

ఎన్నికల్లో నిజాయితీగా గెలవలేక తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికల రోజున నిర్బంధించాలని అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, సీఐ ప్రభాకర్‌ ఒప్పందం మేరకే పోలీసులు బరితెగిస్తున్నారని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వాస్తవంగా గురువారం సాయంత్రం ప్రచారం సాయంత్రానికి తెరపడిందని, మైక్‌ పర్మిషన్‌ లేనప్పటికీ ఆరుగంటల తర్వాత ఇద్దరు ఆటో డ్రైవర్ల గొడవను సాకుగా చూపి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జీవీ ఆంజనేయులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదనే వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికై నా అక్రమ కేసులు బనాయించిన వారిని భేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఈ ఘటనపై జిల్లా ఏఎస్పీ, సీఐతో బొల్లా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement