చైర్మన్‌ పీఠంపై ఆర్యవైశ్య నేతల కన్ను | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ పీఠంపై ఆర్యవైశ్య నేతల కన్ను

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

ముఖ్యమంత్రి సామాజిక వర్గం నాయకుడి మౌనం

నరసరావుపేట: స్థానిక పురపాలక సంఘం చైర్మన్‌ పదవి కోసం టీడీపీలోని ఆర్యవైశ్య నాయకుల మధ్య పోటీ ముదిరి పాకాన పడింది. పదవి కోసం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయగుప్తా, రాష్ట్ర బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కపిలవాయి విజయ్‌కుమార్‌ తీవ్రంగా పోటీ పడుతున్నారు. సీటు కోసం పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులను కలిశారు. పది రోజుల క్రితం గుప్తా కేవలం ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించగా, కపిలవాయి కులమతాలకు అతీతంగా గురువారం సత్తెనపల్లి రోడ్డులోని తన కల్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. వీటికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబులు హాజరయ్యారు. గుప్తాకు ఎమ్మెల్యే చదలవాడ బహిరంగంగానే హామీ ఇవ్వగా, ఎంపీ ఆశీస్సులు మాత్రం విజయ్‌కుమార్‌కు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తన మద్దతుదారుడికి చైర్మన్‌ సీటు ఇప్పించి ఎమ్మెల్యేకు చెక్‌ పెట్టాలని ఎంపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇరువురు ప్రజాప్రతినిధుల నడుమ మొదటి నుంచి కొంత దూరం ఉంది. నియోజకవర్గంలో ఎంపీ పెత్తనాన్ని ఎమ్మెల్యే అంగీకరించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

బీసీలకు కేటాయించి.. తర్వాత మార్పు

చైర్మన్‌ పదవిని తొలుత బీసీలకు కేటాయించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే, గుప్తా, పలువురు ఆర్యవైశ్యులు వెంటనే అమరావతికి వెళ్లారు.

ఆ సీటును ఓపెన్‌ కేటగిరీలో జనరల్‌కు మార్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అధిష్ఠానానికి పార్టీ ఫండ్‌ కింద భారీ మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు చెబుతున్నారు. సీటు విషయంపై మంత్రి నారా లోకేశ్‌ను ఇరువురు అభ్యర్థులు కలిసి వచ్చారు. ఎన్నికల ఖర్చు తాము సర్దుబాటు చేసుకుంటామని లోకేశ్‌కు వారు చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామం తర్వాతే కపిలవాయి తన వేగాన్ని పెంచారు. దీంతో గుప్తా డైలమాలో పడ్డారని చెబుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిని సైతం ఇరువురూ కలిసి వచ్చారు. అయితే, వారెవరికీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. 2014–19 మధ్య గుప్తా చైర్మన్‌గా కొనసాగారని, మరోసారి ఆయనకు సీటు ఇవ్వడమేమిటని కపిలవాయి తన మద్దతుదారులు, పార్టీ నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నారు.

ఏమిటో ఆ పత్రం?

తాను మున్సిపల్‌ చైర్మన్‌ రేసులో ఉన్నానని, మద్దతు తెలియజేయాలని కోరుతూ గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కపిలవాయి కోరారు. అనేక పార్టీలు మారి టీడీపీలోకి వచ్చినట్లుగా తన ప్రత్యర్థులు పోస్టులు పెడుతున్నారని గుర్తుచేశారు. తన వద్దనున్న పత్రాన్ని బయటపెడితే వారి రాజకీయ జీవితాలు సమాప్తమవుతాయని హెచ్చరించారు. వారు పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని గుప్తా కుటుంబాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నా సొంత డబ్బు ఖర్చు చేసి నాయకుడిగా కొనసాగానని, తాను సంపాదించుకున్నది ఏమీ లేదని అన్నారు. అయినా అధిష్ఠానం తనకు సీటు కేటాయిస్తే పోటీ చేస్తానని, వేరేవారికి ఇచ్చినా సహకారం అందజేస్తానని చెప్పారు.

మద్దతు కోరుతూ కపిలవాయి

ఆత్మీయ సమావేశం

తన వద్దనున్న పత్రాన్ని

బయటపెడితే.. అంటూ కీలక వ్యాఖ్య

అభ్యర్థి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల

మధ్య ఆధిపత్యపోరు

ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి రవీంద్ర తాను కూడా పోటీలో ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. పలువురు తన సామాజిక వర్గ నాయకులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని కూడా కలిసి తనకు మద్దతు తెలియజేయాలని కోరారు. అయితే, అధిష్ఠానం నుంచి సంకేతాలు లభించకపోవడంతో ఆయన గత కొద్ది రోజులుగా తన పోటీపై మౌనంపాటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement