వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు
హాని జరిగితే ఎమ్మెల్యేదే బాధ్యత
వినుకొండలో సీఐ ప్రభాకరరావు అరాచకం
కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి
అభివృద్ధి చేసిఉంటే ఎన్నికలంటే ఎమ్మెల్యే జీవీకి భయమెందుకు
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, దాడులు దుర్మార్గం
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజం
వినుకొండ: కూటమి ప్రభుత్వంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కనపెట్టి, నిరంకుశంగా ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పట్టణ పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి గులాంగిరీ చేస్తూ వినుకొండలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం వినుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినుకొండ పట్టణ సీఐ ప్రభాకరరావు పూర్తిగా టీడీపీ ఏజెంట్‌గా మారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలి...
ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులను విధుల నుంచి పూర్తిగా తప్పించి, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వినుకొండలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల అధికారులే సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. స్థానిక పరిస్థితులు, వాస్తవాలు వివరించేందుకు ఒక మాజీ ఎమ్మెల్యేకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
అభివృద్ధి నిజమైతే ఎన్నికలంటే భయం ఎందుకు ...
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేస్తున్న పలు విమర్శలను బొల్లా బ్రహ్మనాయుడు తిప్పికొట్టారు. నియోజకవర్గంలో వందల, వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే టీడీపీ నాయకులకు స్వేచ్ఛగా ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి నిజంగా చేసి ఉంటే ప్రజల తీర్పును కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తన హయాంలోనే తిమ్మాయపాలెం చెరువును 50 ఎకరాల నుంచి 272 ఎకరాలకు విస్తరించి, వినుకొండలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని గుర్తుచేశారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే పోలీసుల అండ చూసుకుని టీడీపీ గూండాలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క కార్యకర్తకు లేదా సామాన్య ప్రజలకు ప్రాణనష్టం లేదా అన్యాయం జరిగినా దానికి ప్రత్యక్షంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు


