లెక్క తప్పుతున్న అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

లెక్క తప్పుతున్న అభ్యర్థులు

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

లెక్క తప్పుతున్న అభ్యర్థులు

పరిమితికి మించి ప్రచార వ్యయం ఓటర్లకు తాయిలాలతో గాలం ఎన్నికల కమిషన్‌ నిబంధనలు బేఖాతర్‌ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం

అభ్యర్థుల ఎంపికలో పార్టీలు కూడా...

జిల్లాలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు

సత్తెనపల్లి: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితిని తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థికి గరిష్ఠంగా రూ. 20 లక్షలు, మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్‌ అభ్యర్థికి రూ. 7.50 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు ఈ పరిమితులను దాటుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధన ప్రవాహం మితిమీరకుండా ఎన్నికల అధికారులు కట్టడి చేయాలని ఓటర్లు కోరుతున్నారు.

అంతటా అంతే...

జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలు ఉన్నాయి. ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీల్లో మున్సిపల్‌ ఎన్నికలను కూటమి నేతలు ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలను కోర్టు కేసుల కారణంగా రెండో విడతలో నిర్వహించనున్నారు. జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీలకు నవంబర్‌ 1న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న కౌన్సిలర్‌ అభ్యర్థులు పదవి కోసం కనీసం రూ. 10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పదవి కోసం కనీసంగా రూ. 1.50 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. 4 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉదయం, సాయంత్రం వేళ ఇంటింటికి ప్రచారం, జన సమీకరణ, రోడ్‌ షోలు, విందులు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రచార వ్యయం భారీగా పెరిగిపోతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక పాటల ప్రచార వాహనాలు, ప్రచార సామగ్రి అద్దెకు రోజుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఖర్చులన్నీ కలిపితే ఎన్నికల వ్యయం నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని పార్టీల నుంచి 30 మంది చైర్మన్‌ అభ్యర్థులు, 398 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరంతా విజయం కోసం తమ శక్తి మేర అర్థబలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

మరోవైపు రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక సామర్థ్యాన్నే ప్రధాన ప్రమాణంగా తీసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. టిక్కెట్లు కేటాయించే దశలోనే అభ్యర్థి ఎంత వరకు ఖర్చు చేయగలరో పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో చాలామంది ఖర్చుకు వెనకాడని స్థితిలో ఉన్న వారేనన్న చర్చ జరుగుతోంది. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సర్వ శక్తులు ఒడ్డుతూ, అనుచర వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఎంత ఖర్చు చేస్తే అంత ప్రచార ఆర్భాటం కనిపిస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికల వ్యయ పరిమితిపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా ఉండాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

మున్సిపాలిటీ వార్డులు చైర్మన్‌ కౌన్సిలర్‌

అభ్యర్థులు అభ్యర్థులు

చిలకలూరిపేట 48 02 64

వినుకొండ 36 03 68

సత్తెనపల్లి 36 02 71

మాచర్ల 36 02 39

మొత్తం 156 09 242

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement