కొనేదెలా.. తినేదెలా? | - | Sakshi
Sakshi News home page

కొనేదెలా.. తినేదెలా?

Oct 28 2026 6:12 AM | Updated on Oct 28 2026 6:12 AM

కొనేదెలా.. తినేదెలా? ఏది చూసినా అంతే... కృత్రిమ కొరతపై చర్యలు శూన్యం

న్యూస్‌రీల్‌

ఒక్కో కుటుంబంపై అదనపు భారం

మండిపోతున్న ధరలు

● ధరల దరువుకు బతుకులే బేజారు

● నిత్యావసర ధరల పెరుగుదలతో

సామాన్య కుటుంబాలు కుదేలు

● బియ్యం నుంచి పప్పుల

వరకు అదే దారి

● వంటనూనె నుంచి గ్యాస్‌ వరకు

తప్పని మోత

● ఆకాశాన్ని అంటుతున్న ఆకుకూరలు,

కూరగాయల ధరలు

● నియంత్రణలో చంద్రబాబు సర్కారు

ఘోర వైఫల్యం

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

నరసరావుపేట టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులైంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఏం కొనాలి, ఏం తినాలి అన్నట్లుగా పరిస్థితి మారింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నిత్యావసర ధరలు పెరగకుండా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ధరల పెరుగుదలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

2024కు ముందు ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బియ్యం 25 కిలోల బస్తా ధర రూ.1,400 నుంచి రూ.2,200కు చేరింది. పాలు లీటరు రూ.44 నుంచి రూ.59కి, పంచదార కిలో రూ.40 నుంచి రూ.75కి, కందిపప్పు రూ.110 నుంచి రూ.170కి పెరిగింది. కోడిగుడ్డు ధర రూ.5 నుంచి రూ.7కి, పెట్రోల్‌ రూ.109 నుంచి రూ.118కి, డీజిల్‌ రూ.94 నుంచి రూ.104కి, టమాటా ధర రూ.20 నుంచి రూ.45కి, మినపప్పు ధర రూ.120 నుంచి రూ.145కు చేరింది. ఇక ఉల్లిపాయల ధర కిలో రూ.20 నుంచి రూ.75కు ఎగబాకగా.. శనగపప్పు రూ.80 నుంచి రూ.110కు, చింతపండు రూ.60 నుంచి రూ.90కు చేరింది. వంటనూనె 15 కిలోల టిన్‌ ధర రూ.2,000 నుంచి రూ.2,820కు పెరిగింది. చికెన్‌ కిలో రూ.180 నుంచి రూ.300కు, వేట మాంసం రూ.800 నుంచి రూ.1,000కు చేరాయి. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.820 నుంచి రూ.985కు పెరిగింది.

ధరలు పెరిగిన ప్రతిసారీ మార్కెట్‌ పరిస్థితులు, సరఫరాలో మార్పులు, ఇతర కారణాలను అధికారులు ప్రస్తావిస్తున్నా.. సామాన్యుడికి మాత్రం ఉపశమనం కనిపించడం లేదు. మార్కెట్‌లో ధరలను పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల పెరుగుదలపై ప్రకటనలతో సరిపెట్టకుండా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మార్కెట్‌ ధరలపై నిరంతర పర్యవేక్షణ, అక్రమ నిల్వలపై తనిఖీలు, పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసరాల సరఫరా, రేషన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధరల తీవ్రతకు తమవంటి వారు కుటుంబ జీవనం ఎలా సాగించాలని సామాన్యులు, పేదలు ఆందోళన చెందుతున్నారు.

పెరిగిన ధరలను పరిశీలిస్తే.. బియ్యం బస్తాపై రూ.800, పాలపై రూ.15, పెట్రోల్‌పై రూ.9, డీజిల్‌పై రూ.10, టమాటాపై రూ.25, పంచదార కిలోపై రూ.20, కందిపప్పుపై రూ.45, మినపప్పుపై రూ.25, వంటనూనైపె రూ.820 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఉల్లిపాయల ధర ఏకంగా కిలోకు రూ.50 పెరగడం గమనార్హం. చింతపండుపై రూ.30, శనగపప్పుపై రూ.30 భారం పడుతోంది. గ్యాస్‌పై రూ.165 పెరుగుదల కనిపిస్తోంది. ఒక్కో వస్తువుపై పెరిగిన మొత్తం తక్కువగా అనిపించినా.. నెలంతా కొనుగోలు చేసే సరుకులన్నింటినీ కలిపితే కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే విద్య, వైద్యం, విద్యుత్‌ బిల్లులు, ఇంటి అద్దెలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ ధరల భారం మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రతి కుటుంబంపై ఎంతలేదన్నా నెలకు సుమారు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు భారం పడుతోంది.

చంద్రబాబు పాలనలో ధరల మోతకు కుటుంబాలే కుదేలవుతున్నాయి. ఒకవైపు చాలీచాలని ఆదాయం.. మరోవైపు నిత్యావసరాల ధరలు పేదలతోపాటు సామాన్యులను కుంగదీస్తున్నాయి. వారు కుటుంబాన్ని నెట్టుకురావాలంటేనే కత్తిమీద సాములా మారింది. తెచ్చిన జీతం, కూలీ డబ్బులు నెలాఖరు వరకు సరిపోని పరిస్థితి నెలకొంది. బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయలు.. ఇలా నిత్యం వంటింట్లో అవసరమయ్యే ప్రతి వస్తువు ధర భారీగా పెరగడంతో నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. ధరలను నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది.

ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే పెరిగిన విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌ ధరలతో సతమతం అవుతున్నాం. మాలాంటి పేద కుటుంబాలు ఇప్పుడు భారీగా పెరిగిన నిత్యావసరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రెండేళ్లలో ఎంతో భారీగా పెరగడంతో పేదలు బతకలేని దుస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వం ధరలను నియంత్రించాలి.

– షేక్‌ ఆదంబీ, నరసరావుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement