లక్కరాజుగార్లపాడులో ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు కుదరదని తేల్చి చెప్పిన అభ్యర్థులు బైండోవర్ పేరుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టణంలో 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బాషాతో పాటు పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భయపెడుతున్న
ప్రజా వ్యతిరేకత...
సత్తెనపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగక ముందే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పల్నాడు జిల్లాలో కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కూటమి నేతలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు రిక్త హస్తాలు చూపించారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ముఖం చాటే చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ క్రమంలో సూపర్ సిక్స్ కొడతామని చెప్పి .. క్లీన్ బౌల్డ్ అయిన నేతలు .. ఇప్పుడు కుట్రలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాని భావిస్తున్నారు. ఇందు కోసం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఖాకీలా క్రౌర్యంతో భయపెట్టే ధోరణి కొనసాగిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 64 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 43 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు బెదిరింపులు, ప్రలోభాలకు ఏమాత్రం భయపడకుండా అతి కష్టం మీద నామినేషన్లు వేయ గలిగారు. చట్టం తమ చుట్టం అన్నట్లు పోలీసులను తమ చేతుల్లోకి తీసుకొని వారి ద్వారా బెదిరింపుల పర్వం చేపట్టి ఎనిమిది మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింప చేయించగలిగారు. నాలుగు నామినేషన్లను అధికారుల ద్వారా చెల్లుబాటు కాకుండా చేశారు. బెదిరింపులు,ప్రలోభాలకు గురికాకుండా బోణి కొట్టి మరీ మూడు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మలిరెడ్డి బ్రహ్మరెడ్డి (లంకెలకూర పాడు), అలుగుమల్లి సీతారావమ్మ(గుండ్లపల్లి–1), వేముల రామాంజమ్మ (దేచవరం) ఏకగ్రీవమయ్యారు.
ఉపసంహరించుకోవాలని బెదిరింపులు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయి మంగళవారం ఉపసంహరణకు చివరి గడువు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులు ఒత్తిళ్లు తీసుకొచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఈ కోవలోనే నకరికల్లు జెడ్పీటీసీ అభ్యర్థి కందుల హనుమాయమ్మ నామినేషన్ ఉపసంహరించుకుంది. పోలీస్‌స్టేషన్లు వేదికగా బెదిరింపులకు దిగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు ఎంపీటీసీలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సత్తెనపల్లి మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు 21 మంది నామినేషన్లు వేయగా లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి జొన్నలగడ్డ బుడ్డ కోటయ్యను నామినేషన్ ఉపరించుకోవాలని పోలీసులు వేధింపులకు గురి చేశారనే విమర్శలు ఉన్నాయి. బుడ్డ కోటయ్యకు బంధువులైన జొన్నలగడ్డ వెంకట్రావు, వెల్లటూరి మరియదాసును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చో పెట్టడంతో వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడి, పార్టీ నాయకులు మంగళవారం సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు బైండోవర్ నిమిత్తం తీసుకొచ్చామంటూ పూచీకత్తుపై పంపారు. పట్టణంలోని 8వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ బాషా, ఆయన సోదరుడు రియాజ్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జానీలను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కూర్చోపెట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలంటూ, పోటీ నుంచి తప్పకోవాలంటూ, అధికార పార్టీ అభ్యర్థుల ఫిర్యాదులు అంటూ పోలీసులు నేరుగా పోలీస్‌స్టేషన్లనే అడ్డాగా చేసుకొని బెదిరింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొనసాగుతున్న ప్రలోభాల పర్వం
మున్సిపల్ ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బెదిరింపులు, ప్రలోభాల పర్వం మరింత కూటమి నేతలు వేగవంతం చేశారు. సత్తెనపల్లిలోని ఓ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి కూటమి నేతలు ఇప్పటికే బెదిరించగా ఆయన ఏ మాత్రం లొంగకపోవడంతో ... ప్రత్యర్థి కౌన్సిలర్‌తో ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరో కౌన్సిలర్ అభ్యర్థికి పోటీ నుంచి తప్పు కోవాలని బెది రింపులకు గురిచేసి చివరకు ప్రలోభాలతో ప్రచారం చేయకుండా దూరంగా ఉండాలని ఆంక్షలు విధించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఓటమి భయం తో ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను కూటమినేతలు భయ పెడుతుంటే .. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల రగులుతున్న వ్యతిరేకత కూటమి నేతలను మరింత భయపెడుతోంది. అధికార పార్టీ నేతల్లో ఈ స్థాయి భయానికి ప్రధాన కారణం ఎన్నికల హామీలను సక్రమంగా అమలుపరచకపోవడంతో ప్రజల్లో వెల్లు వెత్తుతున్న తీవ్ర అసంతృప్తి అన్నది స్పష్టమవుతోంది. రెండున్నరేళ్లలో కొత్తగా ఒక్క పింఛను కూడా ఇవ్వకపోగా ఉన్న పింఛన్లలోనే కోత విధించారనే విమర్శలను ప్రభుత్వం మూట కట్టుకుంది. సమస్యలు ఎక్కడికక్కడ తాండవిస్తున్నా పట్టించుకోని పరిస్థితి. గత ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక ఏ పని చేయలేక వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేకనే గెలుపు కోసం పోలీసుల ద్వారా బెదిరింపులు, ప్రలోభాలు దారిని అధికార పార్టీ ఎంచుకుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


