ఆటగాళ్ల భవిష్యత్‌తో ఫుట్‌బాల్ నరసరావుపేట ఈస్ట్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలు కొందరికి ఆదాయ వనరుగా మారాయి. ప్రతిభగల క్రీడాకారులను పక్కనపెట్టి, తమకు ముడుపులు చెల్లించిన వారిని జిల్లా, రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఫుట్‌బాల్ జట్టు ఎంపికలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. జిల్లాస్థాయిలో కనీసం ప్రాతినిధ్యం వహించని విద్యార్థికి కూడా ట్రిపుల్ ఐటీలో సీటు, ప్రభుత్వ ఉద్యోగం అంటూ అరచేతిలో స్వర్గం చూపించి ఏకంగా రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేసి, జాతీయస్థాయిలో పాల్గొనేలా పథక రచన చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే, ఆటలో ప్రతిభ చూపిన విద్యార్థులు ఈ తంతును బయటపెట్టడంతో స్కూల్ గేమ్స్‌లో జరుగుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
స్కూల్ గేమ్స్ అండర్–17 ఫుట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఇటీవల సత్తెనపల్లి మండలం నందిగామ జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు. జట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. సురేష్‌కుమార్, షేక్ గౌసియా, డి. అనిల్‌దత్ నాయక్‌లు 18 మందితో కూడిన జిల్లా జట్టుతో పాటు మరో ఐదుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. అనంతరం రాజమహేంద్రవరంలో నిర్వహించిన అంతర్ జిల్లాల పోటీల్లో జాతీయ స్థాయిలో ఆడేందుకు రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ఇక్కడే క్రీడాకారుల ఎంపికలో అవినీతి బయటపడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొనని, జట్టుకు ఎంపిక కాని ఓ క్రీడాకారుడిని నేరుగా రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు ఓటమి చెందగా, ఆ జట్టులో సభ్యుడు కాని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థికి రాష్ట్ర జట్టులో స్థానం కల్పించారు. త్వరలో జరగనున్న జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–17 పోటీల్లో ఆడేందుకు అతనికి అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు. నరసరావుపేటకు చెందిన ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన ఇతడు ఇలా ఎంపిక కావడంపై మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పాఠశాల నుంచి జిల్లా జట్టుకు ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో సదరు విద్యార్థి పేరు లేదు. కనీసం అతను పోటీల్లో పాల్గొనలేదు.. ఎంపిక కూడా కాలేదు. రాజమహేంద్రవరంలో ప్రత్యక్షమయ్యాడు. త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనబోతున్నట్లు పాఠశాల యాజమాన్య ప్రతినిధులు ప్రకటించారు.
జిల్లా జట్టు ఎంపికను నిర్వహించిన సెలక్షన్ కమిటీలోని ఓ సభ్యుడు ఇందులో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా పనిచేసిన మున్సిపల్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఫుట్‌బాల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా, కోచ్‌గా, రాష్ట్ర పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అవినీతికి పాల్పడటం వల్లే ఈ విద్యార్థికి సదరు అవకాశం లభించినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లతో పాటు విద్యాశాఖ కార్యదర్శి, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు గుర్తుచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ అండతో పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా కొనసాగారని సహ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఆరోపిస్తున్నారు. పదవీకాలం పూర్తయినా కోచ్‌గా, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర పరిశీలకుడిగా నేటికీ వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఎవరి వివరణ వారిదే...
సదరు విద్యార్థి ఎంపికపై జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పిచ్చయ్యను సంప్రదించగా, ఆ పేరుతో ఏ విద్యార్థీ జిల్లా జట్టుకు ఎంపిక కాలేదని ఆయన స్పష్టం చేశారు. మరి రాష్ట్ర జట్టుకు ఎలా ఎంపికయ్యాడనే ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం రాలేదు. ఇదే విషయమై స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను వివరణ కోరగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. జిల్లా కార్యదర్శుల నుంచి జాబితా, నివేదిక తెప్పించుకుని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర పరిశీలకుడు ఎన్. సురేష్‌కుమార్‌ను వివరణ కోరగా, తాను అంతా సర్దుబాటు చేశానని, సమస్య ఏమీ లేదని తెలిపారు. సదరు విద్యార్థి నేషనల్స్‌కు వెళుతున్నాడా? లేదా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన మౌనమే సమాధానమైంది. ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి, ప్రతిభగల తమ పిల్లలైన క్రీడాకారులకు న్యాయం చేయాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.
● స్కూల్ గేమ్స్ ఎంపికల్లో
అంతులేని అవినీతి
● క్రీడా కోటా ఆశ చూపి
రూ.లక్షలు వసూలు
● కాసులిస్తే నేషనల్
పార్టిసిపేషన్ సర్టిఫికెట్
● జిల్లా స్థాయిలో
పాల్గొనకుండానే నేరుగా ఎంపిక
● గతంలోనూ ఇదే తరహాలో అక్రమాలు
● మున్సిపల్ పాఠశాల వ్యాయామ
ఉపాధ్యాయుడే సూత్రధారి
● ఉన్నతస్థాయి విచారణకు
తల్లిదండ్రుల డిమాండ్
నేరుగా జాతీయ స్థాయికే...
తెరవెనుక నుంచి నడిపించి..
‘‘ఆటలో పాల్గొంటే చాలు.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుంది. ప్రావీణ్యం లేకపోయినా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్నా రిజర్వేషన్ వర్తిస్తుంది. గతంలో రెండు శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను మూడు శాతానికి పెంచారు. ఇక మీదే ఆలస్యం.. అడిగింది ఇచ్చుకోండి.. నేషనల్స్ పార్టిసిపేషన్ పత్రం తీసుకోండి’’ అనే చందంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) తయారైంది. ఒకవైపు డీఎస్సీ క్రీడా కోటాలో ఉపాధ్యాయుల ఎంపికలో తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ గేమ్స్ నేషనల్ సెలక్షన్ కోసం రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి.