నెహ్రూనగర్ గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ తొలి రోజైన మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు ఏసీ కాలేజీలోని ఫెసిలిటేషన్ సెంటర్లో 367 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ఎవరూ ఓటు హక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని, విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటు వేయడానికి వచ్చేవారు ఓటర్ ఐడీ, ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వులు (అపాయింట్మెంట్ ఆర్డర్) విధిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. కేంద్రంలో వీడియోగ్రఫీ, హెల్ప్ డెస్క్‌తో పాటు ధ్రువీకరణ కోసం గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
రైలు నుంచి జారి పడి ప్రయాణికుడు మృతి
తెనాలిరూరల్: రైలు నుంచి పడి గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందిన ఘటన విజయవాడ–చైన్నె రైలు మార్గంలో మంగళవారం జరిగింది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసున్న ప్రయాణికుడు చిలువూరు స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారి పడి అక్కికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎల్.సరస్వతి ఆదివారం తెలిపారు.


