ప్రజాస్వామ్యం సంహరణ! | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం సంహరణ!

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

ప్రజాస్వామ్యం సంహరణ! నామినేషన్ల ఉపసంహరణలో హద్దులు దాటిన పచ్చనేతలు ● చిలకలూరిపేటలో అక్రమంగా 16 వార్డులు ఏకగ్రీవం ● మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ● వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను బలవంతంగా తరలించి అర్ధరాత్రి వరకు కొనసాగించిన ఉపసంహరణల ప్రక్రియ ● నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొనసాగిన దౌర్జన్యకాండ ● నైతిక విలువలు కాలరాసి వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థికీ పచ్చకండువా ● నిబంధనల ఉల్లంఘనపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు

సమయం ముగిసినా

కొనసాగిన

దౌర్జన్య కాండ

నవ్విపోదురుగాక.. మాకేంటి సిగ్గు అన్నట్లుంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా.. రాష్ట్రప్రజలు టీడీపీ నేతల తీరును దుమ్మెత్తిపోస్తూ.. తీవ్రంగా అసహ్యించుకుంటున్నా.. మారని టీడీపీ గూండాలు తమదైన పంథాలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూనే ఉన్నారు. తాజాగా చిలకలూరిపేటలో నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు వారు నడిపిన ఘట్టం వికృత రాజకీయాలకు పరాకాష్టగా మారింది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఆటోల్లో, కార్లల్లో పురపాలక కార్యాలయానికి తరలించడం.. సమయం దాటిపోయినా, అర్ధరాత్రయినా అధికారుల సహకారంతో నామినేషన్లు ఉపసంహరింపజేసుకోవడం చూసినవారికి అసలు ప్రజాస్వామ్యం బతికేఉందా అన్న అనుమానం రాకమానదు.
నామినేషన్ల ఉపసంహరణలో హద్దులు దాటిన పచ్చనేతలు

చిలకలూరిపేట: వికృత రాజకీయాలకు పరాకాష్టగా మారింది చిలకలూరిపేట పురపోరు. నామినేషన్ల ఉపసంహరణ రోజైన ఈ నెల 21 మధ్యాహ్నం 3గంటల నుంచి ప్రారంభమైన పచ్చ క్రీనీడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి షేక్‌ కరిమున్‌కు పచ్చకండువా కప్పి టీడీపీలోకి చేర్చుకోవడంతో పరాకాష్టకు చేరింది. జరుగుతున్న పరిణామాలు చూసి ఆశ్చర్యపోవడం ప్రజలవంతైంది. నామినేషన్ల ఉపసంహరణ రోజు మధ్యాహ్నం 3గంటలకు సమయం ముగుస్తుంది. అయితే అదే సమయంలో పురపాలక సంఘ కార్యాలయాన్ని తమ గుప్పెట్లోకి తీసుకొన్న పచ్చమూక దౌర్జన్యకర రాజకీయాలకు అంకురార్పణ చేశాయి. అదేరోజు పార్టీ అభ్యర్థులకు బీఫారం ఇచ్చేందుకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్‌, న్యాయవాది బెల్లంకొండ నరేంద్రచౌదరిలపై రిటర్నింగ్‌ అధికారి, పోలీసుల సమక్షంలోనే పిడిగుద్దులు కురిపించారు. ఈ సంఘటనలో స్పృహతప్పిన న్యాయవాది నరేంద్రచౌదరి ఆసుపత్రి పాలయ్యాడు.

ఎస్‌ఈసీకి ఫిర్యాదు...

ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి విడదల రజిని ఆ మరుసటి రోజే స్వయంగా వెళ్లి జరిగిన అక్రమాలౖపై ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఏ సమయంలో ఏ అభ్యర్థిని పట్టుకొచ్చి దౌర్జన్యంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారో ఫొటోలు, వీడియోలతో కూడిన ఆధారాలను సమర్పించారు. అవసరమైన పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

కుట్ర వెనుక వ్యూహం...

ఈ దౌర్జన్యకాండకు పరాకాష్టగా నిలిచింది వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థికి టీడీపీ కండువా కప్పడం. నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి ప్రయత్నాలు ప్రారంభించి సామ దాన బేధ దండోపాయాలు ఉపయోగించి చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ కరిమున్‌, ఆమె భర్త షేక్‌ యూసుఫ్‌ఆలికి ఆదివారం రాత్రి పచ్చ కండువా కప్పారు. మొత్తం 48 వార్డులకు గాను 16 వార్డులు ఏకగ్రీవం చేసుకున్నప్పటికీ ఇంకా 32 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారికి సంబంధించిన ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌ నాడు సంబంధిత బూత్‌లలో ఉంటారు. దీంతో దొంగ ఓట్లను ఎదుర్కొనేందుకు కొంతమేరకు అవకాశం ఉంటుంది. వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని టీడీపీలోకి చేర్చుకోవడంతో ఆమె తరఫున టీడీపీవారే ఎన్నికల ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. దీంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా దొంగ ఓట్లు పోల్‌ చేసుకోవడమే అసలు వ్యూహంగా తెలుస్తోంది. అంగబలం, అర్ధబలం, అన్ని వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత, హామీల ఎగవేత వంటి భయాలతోనే ఇలాంటి అక్రమ పద్ధతులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement