నరసరావుపేట ఈస్ట్: గుంటూరులోని శిల్పారామంలో అమరావతి కళావర్ణిక ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంప్–26 చిత్రకళా ప్రదర్శనలో పట్టణానికి చెందిన గర్నెపూడి కల్యాణ్ చిత్రా నికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. చిత్రకారుడు పాబ్లో పికాసో జయంతిని పురస్కరించుకొని ఈనెల 25వ తేదీ ఆదివారం చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించేలా చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో కల్యాణ్ కుంచె నుంచి జాలువారిన ఖగరాజు చిత్రం నిర్వాహకుల ప్రత్యేక ప్రశంసలందుకుంది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు డాక్టర్ వేమూరి సోమశేఖర్ (ఇంగ్లాండ్), ఏఎన్‌యూ ఫైన్ ఆర్ట్స్ విభాగం కోఆర్డినేటర్ పులిచెర్ల దేవకాంత్ చేతుల మీదుగా కల్యాణ్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారులు పాల్గొన్న ఆర్ట్ క్యాంప్–26లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కల్యాణ్‌ను పలువురు చిత్రకారులు, కళాకారులు అభినందించారు.


