దాచేపల్లి: వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని గురజాల డీఎస్పీ ఎం.మహేశ్వరరావు చెప్పారు. మండలంలోని పెదగార్లపాడుకి చెందిన షేక్ సైదా హత్య కేసులో అదే గ్రామానికి చెందిన నిందితులు కర్పూరపు మణికంఠ, షేక్ నాగుర్‌వలి, షేక్ ముస్తాఫాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు. దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ షేక్ ఖాజవలితో కలిసి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడుకి చెందిన షేక్ హస్సన్ బుడే కుమారుడు సైదా ఈ నెల 19వ తేదీ రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుడి తండ్రి హస్సన్ బుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడు సైదాకి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి సదరు మహిళ ఇంటి నుంచి సైదా వస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ తమ్ముడు కర్పూరపు మణికంఠ సైదాని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. ఇద్దరి మధ్య వాగ్వావాదం పెరిగింది. మణికంఠతో పాటు అక్కడే ఉండి మద్యం తాగుతున్న అదే గ్రామానికి చెందిన షేక్ ముస్తాఫా, షేక్ నాగుర్‌వలితో కలిసి సైదా గొంతు నులిమి హత్య చేశారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారు. మృతుడు సైదా తండ్రి ఫిర్యాదుతో పోలీసులు తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైదా హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులు వీఆర్వో వద్ద లొంగిపోయారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని డీఎస్పీ మహేశ్వరరావు చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ జీ.పాపారావు, ఏఎస్‌ఐ షన్ను తదితరులున్నారు.


