ఎస్‌ఐ ప్రియాంకపై కేసు నమోదు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ ప్రియాంకపై కేసు నమోదు చేయండి

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం లేకే.. ● ఎన్నికల్లో ఓడిపోతామనే దాడులు, దౌర్జన్యాలు ● రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు ● మాజీ మంత్రి విడదల రజిని ● తన నివాసం వద్ద జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం లేకే..

నరసరావుపేట రూరల్‌: వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పందుల బుట్టబ్బాయిని కలిసేందుకు బయటకు వచ్చిన తనపై భౌతిక దాడికి పాల్పడిన ఎస్‌ఐ ప్రియాంకపై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి విడదల రజిని జిల్లా ఎస్పీని కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లిని కలిసారు. ఈనెల 23వ తేదీన చిలకలూరిపేటలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై ఆమె ఫిర్యాదు చేశారు. తన నివాసం వద్ద జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐ ప్రియాంక వ్యవహరించిన తీరుపై విచారణ జరపాలని, పోలీసులు న్యాయం చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం..

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందని, ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలను రెడ్‌బుక్‌తో నిర్వహిస్తున్నారని విమర్శించారు. న్యాయం, ధర్మం ఏమీ లేదని వైఎస్సార్‌ సీపీ అక్రమ అరెస్ట్‌లు, అభ్యర్థులపై దాడులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ మధ్యాహ్నం 3గంటల వరకే ఉంటుందని, కాని చిలకలూరిపేటలో మాత్రం అర్ధరాత్రి 12గంటల వరకు కొనసాగిందన్నారు. అధికారుల అండతో టీడీపీ నాయకులు మాఫియాగా మారి అభ్యర్థులను కిడ్నాప్‌లు చేసి బెదిరించి నామినేషన్‌లు ఉపసంహరించుకునేలా చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి భర్తను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని, బలవంతంగా ఆమె పార్టీ మారే విధంగా చేశారని విమర్శించారు.

అధికారంలో ఉండి ప్రజలకు చేసిన మేలు చెప్పి ఓట్లు అడగాల్సిన కూటమి ప్రభుత్వం ఎన్నికలంటే ఎందుకు భయపడుతుందని విడదల రజిని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థులు జిల్లాలో ఒక్క చోట కూడా నామినేషన్‌ వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నామినేషన్‌కు వస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థులపై దాడులు చేసారని తెలిపారు. దీనికోసం ఎన్నికలు, సిబ్బంది, పెద్ద వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు. శాసనసభలో కూర్చుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను చట్టం ద్వారా ప్రకటిస్తే సరిపోతుందని ఎద్దేవాచేశారు. హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటం, వైఎస్సార్‌ సీపీ గ్రాఫ్‌ పెరుగుతుండటంతో ఎన్నికల్లో ఓడి పోతామనే భయంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement