సత్తెనపల్లి: కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం పోస్టల్ బ్యాలెట్‌కు ఫారం–12 విధులు ధ్రువీకరణ పత్రాన్ని, ఓటర్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, జత చేసి ఓటుహక్కు ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు అందజేయాలి. ఆయన పరిశీలించి ఫారం–15, 16, 17, 18 అందజేస్తారు. ఫారం–15: ఇది ఓటరు స్వీయ ప్రకటన. దీనిపై ఓటరు వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి. ఈ ఫారం పై ఎవరైనా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాల్సి ఉంటుంది. ఫారం–16: దీనిని ఇన్నర్ కవర్ లేదా కవర్ –ఏ అని కూడా పిలుస్తారు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ పేపర్‌ను ఉంచుతారు. ఇది తెలుపు రంగులో ఉండటంతో పాటు దీనిపై బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఫారం–17: దీనిని కవర్–బి లేదా అవుటర్ కవర్ అంటారు. ఇందులో రిటర్నింగ్ అధికారి చిరునామా ఉంటుంది. ఫారం–18: ఓటరు తన ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియ జేసే వివరాలు ఇందులో ఉంటాయి.


