రొంపిచర్ల: పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రొంపిచర్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన పమ్మి గోవిందరెడ్డి(46) సుబ్బారెడ్డి కాలనీకి దగ్గర ఉన్న తన పొలం వెళుతున్నాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా, అక్కడ సమీపంలో ఉన్న చెట్టు కిందకి వెళ్లాడు. ఆ సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు చెట్టు కింద కూర్చుని ఉన్న గోవిందరెడ్డి మీద పడటంతో సృహ కోల్పోయి పడిపోయాడు. సమీప పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలు అక్కడికి వచ్చి పిడుగు పడిన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
నాదెండ్ల: ఇరువురు మిత్రుల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకున్న మూడో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన గణపవరం సినిమాహాల్ సెంటర్‌లో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాదెండ్ల గ్రామానికి చెందిన గోపీకృష్ణ, ధనుష్ మిత్రులు. గోపీకృష్ణ సుబాబుల్ తోట నరికే పనులకు వెళ్తుంటా డు. బుధవారం ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ధనుష్ తరపున చిరుమామిళ్ల గ్రామానికి చెందిన జడ జాన్‌పీటర్ మాట్లాడేందుకు వచ్చాడు. ఈ క్రమంలో గోపీకృష్ణపై పీటర్‌పాల్ చేయిచేసుకున్నాడు. దీంతో గోపీకృష్ణ తన చేతిలోని సుబాబుల్ నరికే కత్తితో పీటర్‌పాల్‌పై దాడి చేశా డు. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
‘లలితా’లో 29 వరకు
ఉచితంగా వైద్య పరీక్షలు
గుంటూరు మెడికల్: ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు తక్కెళ్లపాడులోని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్‌లో శుక్రవారం నుంచి 29వ తేదీ వరకు పక్షవాతం(బ్రెయిన్ స్ట్రోక్)పై పలు అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిం నిర్వహిస్తున్నట్లు లలితా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి.రాఘవ శర్మ తెలిపారు. శుక్రవారం లలితా హాస్పిటల్‌లో ఉచిత స్ట్రోక్ రిస్క్ స్క్రీనింగ్ డెస్క్‌ను ఆసుపత్రి సీఈఓ, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోలవరపు అనురాగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవశర్మ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ‘ప్రతి నిమిషం విలువైనది– పక్షవాత లక్షణాలను గుర్తించండి, సకాలంలో స్పందించండి, మెదడును కాపాడండి’ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రోక్ స్క్రీనింగ్ డెస్క్ అక్టోబర్ 29 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు డైట్ సలహాలు, శారీరక కదలికలు, వ్యాయామాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఫిజియోథెరపీ అవగాహనా సేవలను కూడా అందిస్తున్నట్లు డాక్టర్ అనురాగ్ చెప్పారు. ప్రజల్లో పక్షవాతంపై అవగాహన పెంపొందించడం, వ్యాధి ముప్పును తగ్గించేందుకు అవసరమైన జీవనశైలి మార్పులపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని న్యూరాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉప్పాల వీరమ్మ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, న్యూరో కన్సల్టెంట్ డాక్టర్ ఉషాకిరణ్, డాక్టర్ అనూష పాల్గొన్నారు.


