సజావుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

సజావుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

నరసరావుపేట: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సంజన శ్రీహర్షతో కలిపి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గురువారం కొన్నిచోట్ల హింస జరిగిందని నివేదిక అందితే దానిపై పోలీస్‌ ప్రొటెక్షన్‌కు ఆదేశించామని చెప్పారు. గురువారం సాయంత్రం పోలీస్‌ ప్రొటెక్షన్‌తో నామినేషన్‌ సెంటర్లకు అభ్యర్థులను తీసుకొని వచ్చి స్వేచ్ఛగా నామినేషన్‌ వేయించడం జరిగిందన్నారు. శుక్రవారం కూడా మాచర్ల నుంచి వచ్చిన అభ్యర్థులు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులను పోలీసు రక్షణతో లోపలికి తీసుకొని వెళ్లి నామినేషన్‌ వేయించామని తెలిపారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులు స్వేచ్ఛగా, నిర్భయంగా నామినేషన్‌ దాఖలు చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు గానీ, జిల్లా ఎస్పీకి గానీ ఫోన్‌ చేసి రక్షణ కోరితే పోలీస్‌ రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఇదే విషయాన్ని మండలాల్లోని ఎంపీటీసీ ఎన్నికల అధికారికి, రిటర్నింగ్‌ అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందన్నారు. ఎవరైనా అభ్యర్థులు ఫోన్‌, మెయిల్‌ ద్వారా గాని తెలియజేస్తే నామినేషన్‌ దాఖలకు పోలీసు రక్షణ కల్పిస్తామని తెలియజేశారు. అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాలు, జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని చెప్పారు. జిల్లా ఎస్పీతో మాట్లాడటం జరిగిందని, ఎవరైనా అభ్యర్థులు కాల్‌ చేసి చెప్పడం జరిగితే అభ్యర్థులకు ఎస్కార్ట్‌ వాహనంలో నామినేషన్‌ సెంటర్లకు తీసుకొని వెళ్లి నామినేషన్‌ దాఖలకు సహకరిస్తారని తెలియజేశారు. అభ్యర్థులు కూడా పోలీసు వారికి సహకరించాలన్నారు. ఆర్‌డీఓ కె.బాలకృష్ణ, డీఎస్పీ హనుమంతరావుకు పలు సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement