పెదకూరపాడు: నాయకులను అరెస్టు చేస్తే కార్యకర్తలు భయపడరని మాజీ ఎమ్మెల్యే, పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నంబూరు శంకరరావు అన్నారు. గుంటూరులోని తన నివాసంలో గురువారం మాట్లాడారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులను వెన్నుపోటు పార్టీ పోలీసులతో అరెస్టు చెయించి నామినేషన్ వేయకుండా చేస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేస్తే, సజావుగా ఎన్నికలు జరిగితే కూటమి అభ్యర్థులు ఓడిపోతారనే భయంతోనే పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ మండలాల్లోని ముఖ్య నాయకులను అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్లకు తీసుకెళుతున్నారన్నారు. శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులు వెన్నుపోటు పార్టీకి కొమ్ముకాస్తు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రెండున్నర సంవత్సరాలు ప్రజలు మీ రెడ్‌బుక్ రాజ్యాంగంతో విసిగిపోయారని త్వరలో వెన్నుపోటు పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు


