వినుకొండ: స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులు, కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర అక్రమాలు, అడ్డంకులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని, హౌస్ అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులను పోలీసులు నిర్బంధిస్తున్నారని, ఫారమ్‌లను లాక్కొంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వగా, పోలీసులు తన నివాసం వద్ద భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారన్నారు. భవిష్యత్తులో ఈ అక్రమాలకు, చట్ట వ్యతిరేక చర్యలకు పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్ని నిర్బంధాలు విధించినా, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడేదే లేదని, ఈ అక్రమాలపై చట్టపరంగా, ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని అన్నారు.


