పల్నాడులో ప్రజాస్వామ్యం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

పల్నాడులో ప్రజాస్వామ్యం అపహాస్యం

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

పల్నాడులో ప్రజాస్వామ్యం అపహాస్యం నిస్సిగ్గుగా గూండాలకు వత్తాసు వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తల హౌస్‌ అరెస్టులు

టీడీపీ గూండాల దుశ్శాసన పర్వం

సాక్షిప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లాలో పోలీసుల అండతో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్‌ల సందర్భంగా రక్తపాతానికి దిగారు. పల్నాడు జిల్లాలో ఒక్క నామినేషన్‌ కూడా పడడానికి వీల్లేదని బహిరంగంగా సవాల్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలంతా బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేసేలా చర్యలు చేపట్టాల్సిన పోలీసులే టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా పోలీసులంతా పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఎక్కడిక్కడ అడ్డుకుంటూ పూర్తిస్థాయిలో టీడీపీ నేతలకు సహకరిస్తున్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద వందల మంది టీడీపీ గుండాలు కర్రలు, రాడ్లు, రాళ్ల గుట్టలను ఏర్పాటు చేసుకుని హల్‌చల్‌ చేస్తున్నప్పటికీ వారి జోలికి వెళ్లకుండా నామినేషన్‌ పత్రాలతో వెళుతున్న వైఎస్సార్‌ సీపీ నేతలను మాత్రం అడ్డుకుని హౌస్‌ అరెస్టులు చేయడం, లేదంటే ఇళ్లకు పంపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్‌ అభ్యర్థితోపాటు, అన్ని వార్డులకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుని అసలైన అభ్యర్థులు వైఎస్సార్‌ సీపీ బీఫామ్‌లు అధికారులకు అందించేందుకు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి వంద మందికి పైగా టీడీపీ గూండాలతో కలిసి లోపలకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడిచేసి వారి వద్ద ఉన్న బీఫామ్‌లను చించి తగులబెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పల్నాడు జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అంతటితో ఆగని టీడీపీ గూండాలు మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎక్కడా ఒక్క నామినేషన్‌ కూడా పడకుండా ఎక్కడిక్కడ పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులు చేసి నామినేషన్‌ పత్రాలు చించివేశారు. మాచర్ల ఎంపీపీగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన పోతిరెడ్డి సుజాత భర్త కోటిరెడ్డిపై దాడిచేసిన టీడీపీ గుండాలు ఆయన సెల్‌ఫోన్‌ లాక్కొన్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నప్పటికీ వారు ప్రేక్ష పాత్ర వహించారే తప్ప, అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా టీడీపీ నేతలకు అండగా నిలిచారు.

పిడుగురాళ్లలోని తన నివాసంలో ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని తెల్లవారుజామున 2 గంటల సమయంలో అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను నరసరావుపేటలోని తన నివాసానికి తరలించి హౌస్‌ అరెస్టు చేశారు. పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో ఉన్న మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లును అరెస్టు చేసి గురజాల తరలించారు. గురజాల నుంచి పిడుగురాళ్ల వస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, గురజాల మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పోలు వీరారెడ్డిలను మార్గమధ్యంలో అరెస్టు చేసి గురజాలకు తరలించారు. దాచేపల్లి, మాచవరంలో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్‌ వేయకుండా పోలీసులే అడ్డుకుని బలవంతంగా వెనక్కు పంపుతున్న పరిస్థితి.

● పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. నరసరావుపేటలో క్రోసూరు జెడ్పీటీసీగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన డి.చిన్నబాబును పోలీసులు ముందే టీడీపీ గుండాలు దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చించివేసి, తలపగులగొట్టారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ గుండాలు వందల సంఖ్యలో మోహరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడ్డారు. ఐదుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం.

● వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును నరసరావుపేటలోని తన నివాసంలో హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయవద్దంటూ నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా యువజన విభాగం కార్యదర్శితోపాటు అనేక మందిని అరెస్టు కూడా చేశారు. 19వ వార్డు కౌన్సిలర్‌గా పోటీలో ఉన్న ఎం.ఎస్‌.బాబును విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించినా వినకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేస్తామంటూ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు జేసీబీతో అతని ఇంటి వద్దకు వెళ్లి బెదిరించారు. శావల్యాపురం మండలంలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన బీసీ మహిళ నామినేషన్‌ పత్రాలు చించి వేసి ఆమెను బలవంతంగా వెనక్కు పంపారు. బొల్లాపల్లి మండలంలో సైతం ఒక్క నామినేషన్‌ కూడా వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బంధువులను కస్టడీలోకి తీసుకుని పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. నూజెండ్ల మండలంలో పోలీసులు నామినేషన్‌లు వేయకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

● సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో చాగంటివారిపాలెం, లంకెలకూరపాడు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వారిని పోలీసులు, టీడీపీ గుండాలు అడ్డుకుని దాడికి పాల్పడినా లెక్క చేయకుండా వారిని తోసుకుంటూ పరిగెత్తుకెళ్లి నామినేషన్లు వేశారు. రాజుపాలెంలో ఓ ఇంట్లో కూర్చొని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను పూర్తి చేస్తుండగా, టీడీపీ గుండాలు ఇంటిపై దాడిచేసి గొడవకు దిగారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ ఆరోవార్డు అభ్యర్థి మద్దిమాధవ మున్సిపాలిటీ నుంచి రశీదు తీసుకుని బయటకు వచ్చిన తరువాత సమయం ముగిసినా 4.30 గంటలకు అతనిని బెదిరించి విత్‌డ్రా ఫామ్‌పై సంతకం చేయించుకుని దాన్ని లోపలకు పంపి విత్‌డ్రా చేసినట్లు ప్రకటించారు. రాత్రి 8.30 గంటల తరువాత సైతం కౌన్సిలర్‌ అభ్యర్థులను బెదిరించి నామినేషన్‌ విత్‌డ్రా చేయించే కుట్రలకు తెగబడుతున్నారు.

● చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు నామినేషన్‌ కేంద్రాల వద్ద, మున్సిపాలిటీ వద్ద టీడీపీ గుండాలు రెచ్చిపోయి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నా చోద్యం చూశారే తప్ప, కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మున్సిపాలిటీలో బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లిన యువజన విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీక్రాంత్‌, లాయర్‌ బెల్లంకొండ నరేంద్రచౌదరిలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. నరేంద్ర చౌదరికి తీవ్రగాయాలవడంతో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఊపిరి తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మూడు గంటలకు మున్సిపల్‌ నామినేషన్‌ల విత్‌డ్రా ప్రక్రియ పూర్తయినప్పటికీ బుధవారం అర్ధరాత్రి వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కిడ్నాప్‌లు చేసి, బలవంతంగా మున్సిపల్‌ కార్యాలయాలకు తీసుకొచ్చి విత్‌డ్రాలు చేయించారు. నిర్ణీత సమయంలోపు కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్‌లు ఉపసంహరించుకోగా, ఆతరువాత పదుల సంఖ్యలో కౌన్సిలర్‌ అభ్యర్థులను బెదిరించి అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మున్సిపల్‌ అధికారులు విత్‌డ్రాలకు పర్మిషన్‌లు ఇవ్వడం చూస్తుంటే పోలీసులు, అధికారులు ఏస్థాయిలో బరితెగించారో అర్ధం చేసుకోవచ్చు.

చించేసిన నామినేషన్‌ పత్రాలు చూపుతున్న పిడుగురాళ్ల జెడ్పీటీసీ అభ్యర్థి ముడేల భారతి

టీడీపీ గుండాల దాడిలో గాయపడిన పిడుగురాళ్ల జెడ్పీటీసీ అభ్యర్థి భర్త పెద్ద లక్ష్మారెడ్డి

ఎన్నికలను ఎదుర్కొంటాం

బిహార్‌ రౌడీలతో టీడీపీ దాడులు

పోలీసుల అండతో

రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

మాచర్ల నామినేషన్‌ కేంద్రంలోని

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల

బీఫామ్‌లు చించి తగలబెట్టిన వైనం

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి

పల్నాడులోని అన్ని నియోజకవర్గాల్లో

నామినేషన్లు వేయకుండా

అడ్డుకున్న పోలీసులు

జిల్లాలోని ఏడుగురు వైఎస్సార్‌ సీపీ

సమన్వయకర్తలను హౌస్‌అరెస్టు

చేసిన పోలీసులు

నరసరావుపేటలో నామినేషన్లు

వేసేందుకు వచ్చిన జెడ్పీటీసీ

అభ్యర్థులపై టీడీపీ గూండాల దాడి

గూండాలకు అండగా నిలిచిన

పల్నాడు జిల్లా పోలీస్‌ యంత్రాంగం

గురజాల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పిటీసీ నామినేషన్‌ల సందర్భంగా టీడీపీ నేతలు రక్తపాతాన్ని సృష్టించారు. నరసరావుపేటలో జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు వెళ్లిన దాచేపల్లి, పిడుగురాళ్ల అభ్యర్థులు వంగా పద్మా, ముడేల భారతిలపై దాడిచేసి కొట్టడమే కాకుండా వారి వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలు చించివేసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చీరలు లాగి దుశ్శాసనపర్వానికి దిగారు. అంతటితో ఆగకుండా భారతి భర్త లక్ష్మారెడ్డిపై కర్రలు, రాడ్‌లతో దాడిచేసి తల పగులగొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇదంతా పోలీసుల సమక్షంలో జరగడం దారుణమైన విషయం. అది కూడా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ దుర్గటన జరగడం చూస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు సైతం అధికార పార్టీ నేతలకు ఏ స్థాయిలో జీ హుజూర్‌ అంటున్నారో అర్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement