అమరావతి: అమరారామంలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిదేవస్థానంలో దసరా శరన్నవారాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం విజయదశమినాడు రాత్రి 7గంటలకు చండీసమేత అమరేశ్వర స్వామికి పారువేట ఉత్సవం నిర్వహించారు. ఆలయంలోని రెండో ప్రాకారంలోని జమ్మిచెట్టు వద్ద శమీపూజను ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా అమరావతి క్షేత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు మంగళవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్లో జిల్లా జూనియర్ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తామని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన జట్లు నవంబర్లో జరగనున్న అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డుతోపాటు జనన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని పోటీలు జరిగే ప్రాంతానికి రావాలన్నారు. క్రీడాకారులు జనవరి 2, 2007 లోపు జన్మించినవారై ఉండాలన్నారు. 9347785888 నెంబరులో సంప్రదించాలన్నారు.
సత్తెనపల్లి: మద్యం లారీ బోల్తా కొట్టిన సంఘటన సత్తెనపల్లిలోని గుంటూరు రోడ్లో గల పెద్ద కాలువ వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు ఏపీ ఎస్బీసీఎల్ (ఐఎంఎల్) డిపో నుంచి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి సరఫరా చేస్తున్న రూ.15 లక్షల విలువ చేసే 248 కేసుల మద్యం, బీరు లారీ వెనుక చక్రానికి పంక్చర్ పడటంతో లారీ బోల్తా కొట్టింది. దీంతో మద్యం, బీరు సీసాలు కాల్వలోకి పడిపోగా అక్కడ ఉన్న కొందరు కొన్ని మద్యం సీసాలు తీసుకొని పరారయ్యారు. ఘటనా స్థలానికి పట్టణ పోలీసులు చేరుకున్నారు. మద్యం లారీ నిర్వాహకులు పగిలిపోయిన మద్యం సీసాలను తొలగిస్తూ మిగిలిన వాటిని ఏరుతూ, కొన్ని మద్యం సీసాలో నుంచి డ్రమ్ముల్లోకి నింపే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని ఐదు వైన్ షాప్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం పంపిణీ చేసేందుకు కూటమి నేతలు తెప్పిస్తున్నట్టు విమర్శలున్నాయి.
పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ ఎ భారతి విచ్చేశారు. శివాలయానికి మంగళవారం సాయంత్రం విచ్చేసిన ట్రిబ్యునల్ చైర్పర్సన్ ఎ భారతి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శమీ పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎక్స్అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్, ఆలయ వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటలో తెలిపారు. గుంటూరు – కోల్కతా (07437) రైలు ఈ నెల 25, నవంబర్ ఒకటో తేదీన, కోల్కతా – గుంటూరు (07438) ఈ నెల 26, నవంబర్ రెండో తేదీ, విశాఖపట్నం – సికింద్రాబాద్ (08517) ఈ నెల 22, 25 తేదీల్లో, సికింద్రాబాద్ – విశాఖపట్నం (08518) ఈ నెల 23, 26 తేదీల్లో నడుస్తాయి.


