టీడీపీ డిపాజిత్తులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ డిపాజిత్తులు

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

కూటమి కుట్రలకు అధికారుల వత్తాసు!

వైఎస్సార్‌ సీపీ దాచేపల్లి చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

డిపాజిట్‌ చెల్లించలేదని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి రవికుమార్‌ నామినేషన్‌ తిరస్కరణ

డిపాజిట్‌ చెల్లించినట్లు రశీదు చూపిన వైఎస్సార్‌ సీపీ నేతలు

అయినా ఏకపక్షంగా తిరస్కరణ

కూటమి కుయుక్తులకు అధికారుల వత్తాసు

దాచేపల్లి: కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఏకగీవ్రంగా గెలిపించేందుకు అడ్డదారులు తొక్కారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ముగిసేంత వరకు అడుగడుగున కూటమి నేతలు పోలీసులను అడ్డంపెట్టుకుని భారీస్థాయిలో కుట్రలకు తెరలేపారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అన్ని సక్రమంగా చూసుకుని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేసినప్పటికీ కుంటిసాకులు చూపి నామినేషన్‌లను తిరస్కరించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ దాఖలు చేసిన నామినేషన్‌ని అధికారులు తిరస్కరించినట్లు చెప్పారు. దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన నామినేషన్‌ పత్రాల పరిశీలన సందర్భంగా వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి రవికుమార్‌ డిపాజిట్‌ చెల్లించని కారణంగా తిరస్కరించినట్లుగా రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు దాచేపల్లి నగర పంచాయతీలో చేసిన కుట్రలన్నీ బట్టబయలయ్యాయి.

డిపాజిట్‌ చెల్లించినట్లుగా రశీదు ఇచ్చినా

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి రవికుమార్‌పై వరుస వేధింపులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీన నామినేషన్‌ వేసేందుకు సిద్ధపడిన రవికుమార్‌పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారు. చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని రవికుమార్‌ గురజాల న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో అనుమతి ఇచ్చింది. నామినేషన్‌ పత్రాలను న్యాయవాదుల సమక్షంలో ఒకటికి నాలుగు సార్లు పరిశీలన చేసిన తరువాత పోలీస్‌ బందోబస్తుతో ఈ నెల 18న దాచేపల్లిలోని నామినేషన్‌ కేంద్రంలో రవికుమార్‌ నామినేషన్‌ దాఖలాలు చేశారు. రవికుమార్‌ సమర్పించిన అన్నిరకాల పత్రాలను అధికారులు పరిశీలన చేశారు. రవికుమార్‌ డిపాజిట్‌ నగదు చెల్లించినట్లుగా అంగీకరించిన అధికారులు రశీదు కూడా ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధిష్టపరచిన విధంగా దరావత్తుతో చెల్లించారా అని ప్రశ్నించిన చెక్‌లిస్ట్‌లోని మూడో కాలమ్‌లో అధికారులు అవును అని లిఖితపూర్వకంగా రాశారు. రిటర్నింగ్‌ అధికారులు రవికుమార్‌ డిపాజిట్‌ రుసుం చెల్లించినట్లుగా రశీదు ఇచ్చి తీరా నామినేషన్ల పరిశీలనలో ఇబ్బందులు పెట్టారు. రవికుమార్‌ డిపాజిట్‌ చెల్లించినట్లుగా ఆధారాలు లేవని సాకులు చూపుతూ నామినేషన్‌ తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు.

ఓటమి భయంతోనే..

కూటమి అభ్యర్థిని ఏకగీవ్రంగా చైర్మన్‌ చేసేందుకే వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి రవికుమార్‌ నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రవికుమార్‌ అక్రమ అరెస్ట్‌ తరువాత ప్రజల్లో సానుభూతి పెరగటం, దాచేపల్లిలో బలమైన నాయకుడు కావటంతో ఓటమి తప్పదనే భయంతోనే కూటమి నేతలు నామినేషన్‌ పత్రాలను తిరస్కరించేలా అధికారులపై ఒత్తిడి చేశారని మండిపడుతున్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్‌ అభ్యర్థి షేక్‌ షరీఫ్‌ నామినేషన్‌ను సైతం అధికారులు పలు కారణాలతో తిరస్కరించారు. కూటమి అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాసరావును ఏకగ్రీవంగా చైర్మన్‌ చేసేందుకే చైర్మన్‌ అభ్యర్థుల రెండు నామినేషన్లు తిరస్కరించినట్లు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి రవికుమార్‌ నామినేషన్‌ తిరస్కరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కావాలనే ఇలా చేశారా.. లేక కూటమి నేతల ఒత్తిడి తట్టుకోలేక నామినేషన్‌ తిరస్కరించారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విద్యావంతుడైన రవికుమార్‌ న్యాయవాదుల సమక్షంలోనే నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేశాడు. తన ఆస్తులతో పాటుగా అప్పుల వివరాలను ఆఫిడవిట్‌లో పొందుపరిచారు. డిపాజిట్‌ చెల్లించిన తరువాతనే రవికుమార్‌ నామినేషన్‌ వేసేందుకు అధికారులు అనుమతించారు. ప్రతీది నామినేషన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్రమ కేసులో జైలులో ఉన్న రవికుమార్‌ తరఫున నామినేషన్‌ పత్రాల పరిశీలనకు వెళ్లిన షేక్‌ జాకీర్‌హుస్సేన్‌ చెప్పినా కూడా అధికారులు పెడ చెవిన పెట్టారు. డిపాజిట్‌కు సంబంధించిన రశీదు చూపించినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. డిపాజిట్‌ చెల్లించకుండా అధికారులు ఏ విధంగా నామినేషన్‌ వేయించారనేది ప్రశ్నగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement