కొండలెక్కారు..చరిత్రను చదివారు | - | Sakshi
Sakshi News home page

కొండలెక్కారు..చరిత్రను చదివారు

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

బురుజుల నీడలో సాహస పాఠాలు

కొండవీడు కొండలపై కోలాహలం

10 ఆంధ్ర గరల్స్‌ ఎన్‌సీసీ బెటాలియన్‌ నిర్వహణ

ఏపీ, తెలంగాణ నుంచి ట్రెక్‌–3 హాజరైన 252 మంది విద్యార్థినులు

యడ్లపాడు: చరిత్ర ఆనవాళ్లే పాఠాలయ్యాయి..కొండదారులే సాహసానికి వేదికలయ్యాయి.. ప్రకృతి ఒడే పర్యావరణ పాఠశాలగా మారింది. పర్యాటక కేంద్రమైన కొండవీడుకోటలో 252 మంది ఎన్‌సీసీ విద్యార్థినులు సందడి చేశారు. పగలంతా కొండలపై పర్యటిస్తూ ట్రెక్కింగ్‌తోపాటు చరిత్ర, వారసత్వ సంపద, ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచుకున్నారు.

ఏపీ ట్రెక్‌–3 క్యాంప్‌...

10 ఆంధ్ర గరల్స్‌ ఎన్‌సీసీ బెటాలియన్‌ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అటవీశాఖ సహకారంతో నిర్వహించిన ఏపీట్రెక్‌–3లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. సోమవారం 5 ప్రత్యేక బస్సుల్లో కొండవీడు చేరుకున్నారు. సజ్జా మహల్‌ బురుజు మార్గంలో ట్రెక్కింగ్‌ ప్రారంభించి మధ్యాహ్నం వరకు కొండలపై పర్యటించారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ..చారిత్రక కట్టడాలను పరిశీలిస్తూ ఉల్లాసంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో రెడ్డివారి భోజనశాల సమీపంలో కొద్దిసేపు సేదతీరారు.

చరిత్ర..వారసత్వంపై పాఠాలు

కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి కోట చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరించారు. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల రెండో రాజధానిగా వెలుగొంది వందేళ్లపాటు కొండవీడు రాజకీయ కేంద్రంగా నిలిచిందన్నారు. గజపతులు, విజయనగరరాజులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, నిజాంలు, ఫ్రెంచి, బ్రిటిష్‌ పాలకుల పాలనలో ఈ ప్రాంతం ఎదుర్కొన్న చారిత్రక పరిణామాలను వివరించారు. కోట నిర్మాణాల విశిష్టతతోపాటు ఎర్రాప్రగడ, శ్రీనాథుడి సాహితీ వైభవాన్ని ప్రస్తావించారు.

ప్రకృతి పరిరక్షణే బాధ్యత

అటవీశాఖ కొండవీడు అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ కొడాలి వెంకటేశ్వరరావు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. వృక్ష సంపదను కాపాడటం, కాలుష్యాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. కొండలు, లోయల్లో ప్రకృతితో మమేకం కావడం మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందని, ప్రకృతి అనుభవాలు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జీవితంపై చూపిన ప్రభావాన్ని ఉదాహరణగా వివరించారు. ట్రెక్కింగ్‌ అనంతరం విద్యార్థినులు కోట సమీపంలోని రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాలను సందర్శించి వివిధ గ్యాలరీలను తిలకించారు. కార్యక్రమంలో ఎస్‌సీసీ బెటాలియన్‌న్‌ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement