శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

అధికారులను ఆదేశించిన సాధారణ పరిశీలకుడు, జిల్లా కలెక్టర్‌

నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నోడల్‌ అధికారులు బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని పల్నాడు జిల్లా ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాధారణ పరిశీలకుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కన్నబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, ఎస్పీ జగదీష్‌ అదహళ్లిలతో కలిసి కలెక్టరేట్‌లో ఆదివారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అదనపు బలగాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్‌, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలలో వీడియో చిత్రీకరణతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్‌, ఓట్ల లెక్కింపు కేంద్రాలను మున్సిపాలిటీ స్థాయిలోనే సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. నిరంతర తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనల ముందస్తు ధ్రువీకరణ, పెయిడ్‌ న్యూస్‌ పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా జిల్లా స్థాయి ఎంసీఎంసీ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష, డీఆర్‌ఓ కె.అద్దెయ్య, జిల్లా పరిషత్‌ సీఈఓ దుర్గాప్రసాద్‌, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement