చైర్మన్ పదవి ఇస్తానని మోసం చేసిన ఎమ్మెల్యే జీవీని నిలదీసిన ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చర్చలు విఫలం కావడంతో టీడీపీ రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు
వినుకొండ: వినుకొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కూటమి రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షమీమ్ ఖాన్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేయడం స్థానికంగా పెద్ద కలకలమే రేపింది. ఈ నిర్ణయంపై ఆర్యవైశ్య సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత చైర్మన్ పదవి ఆర్యవైశ్యులకు ఇస్తామని పలుమార్లు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, చైర్మన్ ఎన్నికలు వచ్చే సమయానికి ఆర్యవైశ్య సంఘ ప్రముఖులైన రెడ్డి నగేష్, అమర్నాథ్, మోటమర్రి నరసింహారావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, వారికే చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారు. దీంతో ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్న ఆ వర్గాలవారు తీరా నామినేషన్ వేసే సమయానికి ముస్లిం సామాజిక వర్గానికి చైర్మన్ సీటు కేటాయించడంతో ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈక్రమంలో ఆదివారం పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివా సం వద్దకు చేరుకున్న ఆర్యవైశ్యులు, చైర్మన్ పదవిని తమ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆంజనేయులు ఇంటిని చుట్టుముట్టారు. తమ డిమాండ్‌ను పరిశీలించాలని కోరుతూ ఇంటి వద్దే నిరసనకు దిగారు. అయితే, ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులతో వారు జరిపిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. అధిష్టానం నిర్ణయం మార్చుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేయడంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి.
టీడీపీ రెబెల్స్‌గా నామినేషన్లు..
చర్చలు విఫలమవడంతో ఆగ్రహించిన ఆర్యవైశ్య సంఘ నాయకులు కూటమి తీరుపై తిరుగుబావుటా ఎగురవేశారు. తమ పట్టును నిరూపించుకునేందుకు అధికార టీడీపీకి వ్యతిరేకంగా టీడీపీ రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ రెబల్స్ రెడ్డి నగేష్ ఆయన సతీమణి రెడ్డి నాగ పద్మలు చైర్మన్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అలాగే అమర్నాథ్ కూడా రెబెల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. అధికారిక అభ్యర్థి ప్రకటనతో వినుకొండ టీడీపీలో ప్రారంభమైన ఈ అంతర్గత కుమ్ములాటలు, ఆర్యవైశ్యుల తిరుగుబాటు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఆర్యవైశ్య వర్గీయులు రెబల్స్‌గా మారడం టీడీపీకి తలనొప్పిగా మారింది.


