నరసరావుపేట: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జొన్నలగడ్డ రోడ్డులోని తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, వాహనాల రాకపోకల మార్గాలు, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత తదితర అంశాలపై అధికారులు, కళాశాల ప్రతినిధులతో చర్చించారు.
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్‌ను అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం రాత్రి సమాచారం వచ్చిందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి తెలిపారు. నాగూర్‌మీరాన్ గత మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు సేవలందించారు. అంతేకాక వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీసీ జనరల్‌కు కేటాయించిన విషయం విధితమే. ఈ క్రమంలో ముస్లీం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన షేక్ నాగూర్‌మీరాన్‌ను సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గురజాల: గురజాల నగర పంచాయతి ఎన్నికల నేపథ్యంలో దాచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను అక్రమ అరెస్టు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ మద్యం కేసు బనాయించి తనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని ఆరోపిస్తున్న కొప్పుల రవి నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు రిమాండ్‌లో ఉన్న దాచేపల్లి నగర పంచాయతి వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను పోలీసులు ఎస్కార్ట్‌తో నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి నామినేషన్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు రవి తరుపున న్యాయవాది తెలిపారు.
వినుకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేకించి దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల ప్రాంతాల్లో ఇతర రాజకీయ పార్టీలను నామినేషన్లు వేయనీయకుండా పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రత్యేకంగా సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా భయభ్రాంతులకు గురిచేయడం, నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లిన వారిని అడ్డుకుని వెనక్కి పంపడం లాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే ముప్పని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు ఉంటుందని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడిన సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరుగుతున్న ఈ అణచివేతను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. ఇప్పటికై నా ఎన్నికల సంఘం మరియు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.
అత్యధికంగా నరసరావుపేటలో 22.4 మి.మీ
నరసరావుపేట: నరసరావుపేటతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 28.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. అత్యధికంగా నరసరావుపేటలో 22.4 మి.మీ వర్షం కురవగా నాదెండ్లలో 6.4 వర్షం కురిసింది. శనివారం రాత్రి వరకు నరసరావుపేటలో అడపా తడపా వర్షం కురుస్తూనేవుంది.


