ఆర్యవైశ్యుల ఆశలపై నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యుల ఆశలపై నీళ్లు!

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

ఆర్యవైశ్యుల ఆశలపై నీళ్లు!

మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని మోసం చేసిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకొన్న ఎమ్మెల్యే జీవీ భగ్గుమన్న ఆర్యవైశ్య సామాజిక వర్గం

వినుకొండ:అధికార బలంతో పదవులను పంచుకోవచ్చని భావించిన తెలుగుదేశం పార్టీకి వినుకొండలో ఊహించని షాక్‌ తగిలింది. గత రెండు దశాబ్దాలకు పైగా చైర్మన్‌ పీఠం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆర్యవైశ్యుల ఆశలపై టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం నీళ్లు చల్లారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ ఆర్యవైశ్యులకు ఇస్తామన్న చైర్మన్‌ సీటును చివరి నిమిషంలో చేజార్చడం, దాన్ని ముస్లిం మైనార్టీ వర్గానికి కేటాయించడంపై ఆ సామాజిక వర్గంలో ఇప్పుడు ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి.

మోసపోయమంటూ రగిలిపోతున్న వ్యాపార వర్గం

వినుకొండ మున్సిపల్‌ ఎన్నికల వేళ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మొదటినుంచి ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యా పారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. ఈ సారి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కచ్చితంగా ఆర్యవైశ్యులకే దక్కుతుందని నమ్మబలికారు. దీంతో గత 26 ఏళ్ల కల నెరవేరబోతుందని ఆ వర్గం ఎంతో ఆశపడింది.

కూటమి శిబిరంలో అంతర్మథనం.....

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున యువ నాయకుడు పి.పి.ఎస్‌. ఖాన్‌ని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రంగంలోకి దించటంతో కూటమి శిబిరంలో అంతర్మథనం మొదలైంది. ముస్లిం సామాజిక వర్గం పూర్తిగా వైసీపీకి అండగా ఉందనే అంచనాతో, ఆర్యవైశ్యులకు సీటిస్తే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని భయపడిన ఎమ్మెల్యే చివరి క్షణంలో ప్లేట్‌ ఫిరాయించడంతో మూడు రోజుల పాటు ‘ఇదిగో సీటు.. అదిగో సీటు‘ అంటూ నాన్చి, చివరకు ‘రెండున్నర సంవత్సరాలు ఆర్యవైశ్యులకు, మరో రెండున్నర సంవత్సరాలు ముస్లింలకు‘ అంటూ కొత్త తెర వెనుక నాటకం ఆడింది. అంతటితో ఆగకుండా ‘నాకేం సంబంధం లేదు.. ఇది అధిష్టానం నిర్ణయం‘ అంటూ ఎమ్మెల్యే చేతులు ఎత్తేయడం ఆర్యవైశ్యుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి కారణమైంది. మోసపూరిత వైఖరిని సహించలేని వినుకొండ ఆర్యవైశ్యులు ఇక వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. టీడీపీతో ఎలాంటి సంబంధం లేకుండా తామే స్వయంగా నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇటు ఆర్యవైశ్యుల తిరుగుబాటు, అటు బీజేపీ నాయకులు, టీడీపీలోని అసంతృప్త రెబల్స్‌ కూడా భారీగా నామినేషన్లకు సిద్ధమవుతుండటంతో కూటమిలో గుబులు మొదలైంది. టీడీపీ తీసుకున్న పూటకో మాట, నిమిషానికో నిర్ణయం వల్ల స్థానికంగా ఆర్యవైశ్య ఓట్లు చీలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇచ్చిన మాట తప్పిన నాయకత్వానికి వినుకొండ ప్రజలు, ఆర్యవైశ్యులు బ్యాలెట్‌ ద్వారా ఎలాంటి బుద్ధి చెబుతారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement