పదిమందికి గాయాలు
పిడుగురాళ్ల: పార్కింగ్ కోసం రోడ్డు దాటుతున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనగా పదిమంది ప్రయాణికులు సంఘటన శనివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు... గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లోడ్ లారీ తెల్లవారుజామున లారీ డ్రైవర్ నిద్ర రావటంతో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పార్కింగ్ చేసేందుకు మలుపు తిప్పుతున్నాడు. ఈక్రమంలో అదే దారిలో వస్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ వేగంగా లారీ దగ్గరకు వచ్చిన తరువాత ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయటంతో బస్సు లారీని ఢీకొంది. లారీలో ఉన్న క్లీనర్‌తో పాటు బస్సులో ఉన్న 10మందికి గాయాలయ్యాయి. వారికి ప్రథమ చికిత్స నిర్వహించి, ప్రయాణికులను మరో బస్సుద్వారా హైదరాబాద్ తరలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రమాదానికి గురైన లారీని పొక్లెయిన్ సహాయంతో తొలగించారు. ఈసంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.


