నరసరావుపేట: స్థానిక ఎన్నికల నిర్వహణకు పోలింగ్ అధికారులు (ఆర్‌ఓ), సహాయ పోలింగ్ అధికారులు (ఏఈఆర్‌ఓ)లకు సమగ్ర శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అవగాహన కల్పించాలన్నారు. చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించేలా రెండో విడత శిక్షణను శనివారం పట్టణంలోని భువనచంద్ర టౌన్‌హాలులో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని అన్నారు. ప్రతి ఉద్యోగికి ఎన్నికల నిర్వహణ గొప్ప అనుభవమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. చిన్న పొరపాటు జరిగినా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.


