నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఘర్షణకు దిగి వీరంగం మహిళలనీ చూడకుండా నెట్టివేత ప్రాణభయంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు
దాచేపల్లి: నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సమర్పించాల్సిన నామినేషన్ పత్రాలను కూటమి నేతలు చించివేశారు. పోలీసుల అండదండలతో నామినేషన్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన కూటమి నేతలు, శనివారం నామినేషన్ పత్రాలు వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను తీవ్రస్థాయిలో బెదిరించి, వారి నామినేషన్ పత్రాలను చించివేశారు. దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను చుట్టుముట్టి తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థులుగా కొప్పుల రామకృష్ణ, షేక్ సుభానితో పాటు 12 వార్డులకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అతి కష్టం మీద నామినేషన్ కేంద్రం సమీపానికి చేరుకున్నారు. అప్పటికే నగర పంచాయతీ కార్యాలయం చుట్టుపక్కల కాపుకాసి ఉన్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు.. ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. అభ్యర్థులు దేవళ్ల లక్ష్మీప్రసన్న, షేక్ ఖాదర్ బాషా, జంగాల సింగరయ్య యాదవ్, షేక్ మస్తాన్‌వలితో పాటు పలువురు మహిళా అభ్యర్థులను అడ్డగించారు. వారి వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని చించివేశారు. మహిళా అభ్యర్థులని కూడా చూడకుండా వారిపై దుర్భాషలాడుతూ నెట్టివేసి ఇబ్బందులకు గురిచేశారు. నామినేషన్ కేంద్రం వద్ద కూటమి నేతలు హల్‌చల్ చేస్తూ అభ్యర్థులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. దాచేపల్లిలోని నేతలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ఇతర మండలాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులను తీసుకువచ్చి బీభత్సం సృష్టించారు. టీడీపీ నేతల దుశ్చర్యలను చూసి అక్కడ ఉన్న వారంతా మండిపడ్డారు. నామినేషన్ పత్రాలను చించివేసి బెదిరింపులకు గురిచేయడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని లేకుండా చేశారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఈ విషయంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు చెప్పారు. టీడీపీ నేతల బెదిరింపులు, దాడులతో దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణం చుట్టూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బయలుదేరాను. మొదట పోలీసులు అడ్డుకున్నారు. అధిగమించి నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నా. అక్కడ టీడీపీ నాయకులు దాడి చేసేందుకు దూసుకొచ్చారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఇంతటి దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదు. ఏదైనా ఎన్నికల ద్వారా తేల్చుకోవాలి. కానీ, ఇలా బెదిరించి నామినేషన్లు వేయకుండా చేయడం సరైన పద్ధతి కాదు.
– షేక్ సుభాని,
వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి
దాచేపల్లి నగర పంచాయతీ 16వ వార్డులో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేసేందుకు నేను వెళ్లాను. చూడగానే 200 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు, గుర్తుతెలియని వ్యక్తులు నా వద్దకు వచ్చి బెదిరించారు. నన్ను దుర్భాషలాడుతూ నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని చించివేశారు. వారిలో కొంతమంది నన్ను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించారు. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కును టీడీపీ నాయకులు కాలరాస్తున్నారు. విద్యావంతురాలినైన నన్ను అవమానించేలా మాట్లాడారు.
– దేవళ్ల లక్ష్మీప్రసన్న,
వైఎస్సార్ సీపీ అభ్యర్థి


