నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల అడ్డగింత దాటుకుని కేంద్రాల వద్దకు వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకోవడంతో ఇబ్బందులు
దాచేపల్లి, పిడుగురాళ్ల రూరల్: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసులు శనివారం అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను సీఐ షేక్ ఖాజావలి వేలెత్తి చూపిస్తూ బెదిరించారు. లాఠీచార్జి చేస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ భర్త సాంబయ్య చొక్కా పట్టుకుని లాగేశారు. తమకు శాంతియుతంగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరినప్పటికీ సీఐ ససేమిరా అన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అవకాశం కల్పిస్తానని సీఐ హామీ ఇవ్వడంతో అభ్యర్థులు వెనుదిరిగారు. తిరిగి రెండు గంటల ప్రాంతంలో ముత్యాలంపాడు అడ్డరోడ్డు వద్దకు రావడంతో సీఐ మళ్లీ అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అభ్యర్థి వెళ్లి నామినేషన్ వేయాలని చెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు కాపు కాశారని, తాము ఒంటరిగా వెళ్తే తమపై దాడులు చేస్తారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తెలిపారు. చివరికి నామినేషన్ కేంద్రం వద్దకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వెళ్లగానే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దుర్భాషలాడారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ముత్యాలంపాడు అడ్డరోడ్డు వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి హైవేపై బైఠాయించారు. పోలీసులు, టీడీపీ నేతల తీరును నిరసించారు. దీంతో సీఐ లాఠీలతో వారిని చెదరగొట్టారు. నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై పరుగులు తీశారు. వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల కన్వీనర్లు షేక్ సుభానీ, కోట కృష్ణ, నగర పంచాయతీ చైర్మన్ భర్త కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునగా పున్నారావు, వైస్ చైర్మన్లు కొమెరబత్తిన విజయకుమార్, షేక్ ఖాదర్ బాషా, మాజీ సర్పంచులు మందపాటి రమేష్‌రెడ్డి, బుర్రి విజయకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కందుల జాను, మాజీ వైస్ ఎంపీపీ తండా అబ్దుల్ సత్తార్, నాయకులు కుందురు తిరుపతిరెడ్డి, మందపాటి వీరారెడ్డి, కొలా జంపాలరెడ్డి, తమ్మిశెట్టి రామకృష్ణ, పరిమి బాబు, మునగా శ్రీనివాసరావు, షేక్ సైదా, జక్కా అశోక్, ముడి విక్టర్‌పాల్, కూసం నాగిరెడ్డి, మీసాల ఆనందరావు, యర్రంశెట్టి సైదారెడ్డి, ఈదా వెంకటరెడ్డి, వంగా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


