పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి మరీ అరెస్టు చేసిన పోలీసులు అభ్యర్థులను గుర్తించి అర్ధరాత్రి ఇళ్ల వద్ద ఖాకీల అరాచకం
పిడుగురాళ్ల/మాచవరం: పట్టణంలోని వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్ల వద్దకు, వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు వెళ్లి, కార్యాలయంలో ఎందుకు ఉన్నారని కేకలు వేశారు. తప్పేంటని నాయకులు ప్రశ్నించారు. దీంతో వారిని అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులను కారంపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్సీపీ నాయకులు, అభ్యర్థులు గుర్రం అప్పిరెడ్డి, కానాల శ్రీనివాసరెడ్డి, మందా సుధీర్, మందా ఆనంద్, నంద్యాల బాబులను వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద అరెస్టు చేశారు. అల్లు పిచ్చిరెడ్డి, కందుకూరి శ్రీనివాసరావు, ఓర్సు దుర్గాప్రసాద్, ఇర్లా శివలను వారి ఇళ్ల వద్ద అరెస్టు చేశారు. చల్లా శివారెడ్డి, ముడేల శ్రీనివాసరెడ్డిలను కరాలపాడు గ్రామంలో ఆటోలో వచ్చిన కానిస్టేబుల్ అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. మరికొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల కోసం పోలీసులు ప్రతి వార్డులోనూ జల్లెడ పట్టి మరీ వెతికారు. విషయం తెలుసుకున్న కొంతమంది పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని, ఎవరూ నామినేషన్ దాఖలు చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. పిడుగురాళ్ల పట్టణ సీఐ నామినేషన్ దాఖలు చేసే కేంద్రాల వద్ద పార్టీ పేర్లు అడిగి మరీ అభ్యర్థులను పంపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయం వద్దకు ఎక్కువ సంఖ్యలో మొదటి వార్డుకు చెందిన టీడీపీ మహిళలు వస్తే మాత్రం వెంటనే నామినేషన్ దాఖలు చేసేందుకు పంపించారు.


