పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, ఆర్యవైశ్య సంఘం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త భవనాశి యల్లారావుపై పిడుగురాళ్ల పట్టణ పోలీసులు బైండోవర్ నమోదు చేశారు. ఆర్యవైశ్య సంఘంలోనూ, వైఎస్సార్సీపీలోనూ బలమైన నాయకుడిగా ఉన్న యల్లారావు చురుగ్గా పనిచేస్తే మున్సిపాలిటీలో ప్రభావం ఉంటుందని భావించిన కూటమి నేతలు... పోలీసుల ద్వారా ఆయనపై బైండోవర్ నమోదు చేయించారని ప్రచారం జరుగుతోంది. పట్టణంలోని భవనాశి యల్లారావు కల్యాణ మండపంలో ఓ సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమం జరుగుతుండటంతో వారంతా కల్యాణ మండపం వద్దకు హాజరయ్యారు. ఉలిక్కిపడిన కూటమి నేతలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులు, ఓ సామాజిక వర్గానికి చెందిన వారు భవనాశి కల్యాణ మండపం వద్దకు వెళ్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని భవనాశి యల్లారావును పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనపై బైండోవర్ నమోదు చేసినట్లు సమాచారం. యల్లారావు చురుగ్గా పనిచేస్తే ఆర్యవైశ్య సామాజిక వర్గంలోనే కాకుండా, ఎన్నికల సమయంలోనూ ప్రభావం చూపిస్తారని కూటమి నాయకులు భయాందోళనలకు గురై ఆయనపై బైండోవర్ నమోదు చేయించారని ఆర్యవైశ్య సామాజిక వర్గంలో చర్చ జరుగుతోంది.


