పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించగా పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో వారిని రానివ్వలేదు. ఒక వైపు పోలీసులు, మరొక వైపు కూటమి నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో నామినేషన్ల కార్యక్రమం ముందుకు సాగలేదు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులకు గాను శివాలయం వద్ద ఉన్న ఎంపీపీ స్కూల్‌లో సగం, మున్సిపల్ కార్యాలయంలో మిగతా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు వార్డులకు కలిపి ఒక కౌంటర్ ఏర్పాటైంది. తొలిరోజు బారికేడ్ల వద్దనే వైఎస్సార్ సీపీ వారిని పోలీసులు అడ్డుకున్నారు.
500 మంది హల్‌చల్
కూటమి నాయకులు, కార్యకర్తలు 500 మంది నామినేషన్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద 100 మీటర్ల దూరం నుంచే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా గేటును మూసివేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఆవులయ్య అనే నాయకుడు తన నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం కూడా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనివ్వలేదు. ఆయన్ను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త భవనాశి యల్లారావును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కల్యాణ మండపంలో సమావేశాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలో ఇలా చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఆ కార్యక్రమాలతో తనకు సంబంధం లేదని యల్లారావు తెలిపారు. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. అరెస్టును తీవ్రంగా ఖండించడంతో యల్లారావును తహసీల్దార్ కార్యాలయానికి తీసుకుని వెళ్లి బైండోవర్ పెట్టి విడుదల చేశారు.


