రైట్‌ గేర్‌ ఎక్విప్‌మెంట్‌పై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రైట్‌ గేర్‌ ఎక్విప్‌మెంట్‌పై సమీక్ష

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

నరసరావుపేట రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అవసరమైన సందర్భాల్లో వినియోగించాల్సిన రైట్‌ గేర్‌ ఎక్విప్‌మెంట్‌పై సమీక్షను గురువారం నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ, పోలీసు సిబ్బంది సంసిద్ధత, ప్రజలకు భద్రత కల్పించే చర్యల్లో భాగంగా సంబంధిత పరికరాల వినియోగంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఉన్నతాధికారుల ఆదేశాలు, నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని తెలిపారు. ఆర్‌ఐలు కృష్ణ, గోపినాథ్‌, ఏఆర్‌ సిబ్బందిలు పాల్గొన్నారు.

ఆలయంలో హుండీల చోరీ

చిలకలూరిపేటటౌన్‌: పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీ ఫస్ట్‌లైన్‌న్‌లో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి రెండు హుండీలను లక్ష్యంగా చేసుకోగా.. ఒక హుండీని ధ్వంసం చేసి నగదు అపహరించారు. మరో హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ పరిసరాల్లో రాత్రివేళ కొందరు మద్యం, గంజాయి సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాను రెండు వారాల క్రితమే ధ్వంసం చేశారని, మద్యం సేవిస్తున్న వారిని ప్రశ్నించిన వాచ్‌మెనన్‌ను రెండు రోజుల క్రితం బెదిరించారని చెబుతున్నారు. ఈ ఘటనల వెనుక సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు చోరీపై విచారణ జరిపి నిందితులను గుర్తించాలని, రాత్రివేళ గస్తీ పెంచి ఆలయానికి రక్షణ కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

23న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి

నరసరావుపేట ఈస్ట్‌: క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన సతైనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి గురువారం తెలిపారు. పోటీలను 19 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, బెస్ట్‌ ఫిజిక్‌, క్యారమ్స్‌, చెస్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, లాన్‌ టెన్నీస్‌, పవర్‌ లిఫ్టింగ్‌, షటిల్‌ బాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, టెబుల్‌ టెన్నీస్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, యోగా అంశాలలో పోటీలు నిర్వహించి జిల్లా జట్టు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయ గుర్తింపు కార్డు, ఇతర ధ్రువ పత్రాలతో 23వ తేదీ ఉదయం 9గంటలకు స్టేడియంలో హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

బైండోవర్లలోనూ రాజకీయ లెక్కలే!

75 శాతం వైఎస్సార్‌సీపీ వారే..!

చిలకలూరిపేటటౌన్‌/యడ్లపాడు: ఎన్నికల వేళ పోలీసుల బైండోవర్‌ చర్యలు ముమ్మరమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా చిలకలూరిపేట అర్బన్‌, యడ్లపాడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 320 మందిపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. గురువారం నాటికి ఇరు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ సమానంగా 160 మంది చొప్పున ఈ కేసులు నమోదయ్యాయి. అయితే, బైండోవర్‌ కేసుల్లో రాజకీయ పార్టీల వారీగా ఉన్న నిష్పత్తి చర్చనీయాంశంగా మారింది. నమోదైన కేసుల్లో సుమారు 75 శాతం మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఉండగా, అధికారపార్టీకి చెందిన వారు 25 శాతం మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ముందస్తు పోలీసు చర్యలు సహజమే అయినప్పటికీ, కేసుల నమోదులో ఈ వ్యత్యాసం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్న వేళ, బైండోవర్‌ కేసుల నమోదు ఏ ప్రాతిపదికన జరుగుతోంది? అన్ని పార్టీల వారిపైనా సమానంగా చర్యలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు అటు పార్టీనేతల్లోనూ, ప్రజల్లోనూ చర్చకు వస్తున్నాయి. బైండోవర్లపై స్థానికంగా చర్చ సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement