రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం
నాదెండ్ల: గణపవరం గ్రామంలోని పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేట అగ్నిమాపకదళ అధికారి అన్వేష్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న సాంబశివ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మంగళవారం రాత్రి యంత్రాల్లో రాళ్లు పడి నిప్పురవ్వలు రాజుకుని పత్తిపై పడటంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కంపెనీలో కొన్నేళ్లుగా సర్జికల్ కాటన్, ఇయర్ బడ్స్, దీపారాధన ఒత్తులు తయారు చేస్తుంటారు. మంగళవారం రాత్రి నైట్ షిప్ట్‌లో రాత్రి 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యంత్రాలతో సహా ముడిపదార్థం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట ఫైర్ ఇంజిన్తోపాటూ మరో నాలుగు ఇతర ప్రాంతాల ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆ సమయంలో యజమాని పెంటేల సత్యనారాయణ ఇతర ప్రాంతంలో ఉండటంతో బుధవారం రాత్రి ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని గురువారం ఉదయం అగ్నిమాపక దళ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.60 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు.


