తాకట్టులో ఉన్న బంగారం విడిపించాలని కోరి.. రూ.5.50లక్షలతో పరారీ
నర్సంపేట రూరల్: తాకట్టులో ఉన్న బంగారం విడిపిస్తే మళ్లీ మీకే ఆ బంగారాన్ని విక్రయిస్తామని చెప్పి రూ.5.50 లక్షలు మాయం చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. తన బంగారం ఫెడ్ బ్యాంకులో తాకట్టులో ఉందని, ఆ బంగారాన్ని విడిపిస్తే తిరిగి మీకే విక్రయిస్తానని గుంటూరుకు చెందిన శ్రీఆంజనేయ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని ఫోన్‌లో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన బోడ శ్రీకాంత్ సంప్రదించాడు. దీంతో ఆ కంపెనీ.. తన సేల్స్‌మన్‌ని ఈనెల 13న నర్సంపేటకు పంపించింది. సదరు సేల్స్‌మన్‌ని శ్రీకాంత్ రిసీవ్ చేసుకుని అంగడి రోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఈ బ్యాంకులోనే తనకు ఖాతా ఉందని, నగదును బదిలీ చేస్తే తాను ఫెడ్‌బ్యాంక్‌కు బదిలీ చేసి బంగారం తీసుకొస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ గోల్డ్‌ఫైనాన్ సేల్స్‌మెన్ నమ్మి కంపెనీ ప్రతినిధులో మాట్లాడి రూ.5 లక్షలు శ్రీకాంత్ ఖాతాలో జమ చేయించాడు. మరో రూ.50వేలు ఫోన్‌పే ద్వారా పంపించాడు. అనంతరం, సెల్స్‌మెన్‌ను అక్కడే కూర్చోబెట్టి ఇప్పుడే వెళ్లి వస్తానని చెప్పి అక్కడినుంచి శ్రీకాంత్ వెళ్లిపోయి తిరిగిరాలేదు. అనంతరం మొబైల్ ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయినట్లు సెల్స్‌మెన్ గ్రహించి నర్సంపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. గతంలో కూడా శ్రీకాంత్‌పై పలు సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ వివరించారు.


