రాజుపాలెం: అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డిగూడెం –హసాన్‌బాద్ రోడ్డుపై బ్రాహ్మణపల్లి ఆర్చీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన తన్నీరు వెంకటేశ్వర్లు భార్య రమణ(35) నాగవరం నుంచి సత్తెనపల్లి తాపీ పనికి ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. బ్రాహ్మణపల్లి ఆర్చీ సమీపానికి వచ్చే సరికి ద్విచక్రవాహనం ముందు వెళుతున్న ఇసుక ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేసి ముందుకు రావడంతో అతివేగంగా ఉన్న ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న రమణ ఒక్కసారిగా క్రిందపడి పోయింది. కింద పడిపోడిపోయిన ఆమెను ట్రాక్టర్ తొక్కించుకుని ముందుకు వెళ్లడంతో అక్కడికక్కడే సృహతప్పి పడిపోయింది. బ్రాహ్మణపల్లి గ్రామస్తులు 108 సహాయంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.


