నిందితుడు అరెస్టు పన్నాగం పన్ని వెంట తెచ్చుకున్న కత్తితో దాడి గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు
పిడుగురాళ్ల: అనుమానమే ఓ మహిళకు హత్యకు దారి తీసిందని గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. పట్టణంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.... రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బత్తుల గోవిందు అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి సుజాతతో నాలుగు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నాడు. సుజాత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు భావించిన గోవిందు కక్ష పెంచుకున్నాడు. సుజాత పిడుగురాళ్ల పట్టణంలో ఓ కార్యక్రమానికి పెద్దమ్మ దేవళ్ల పార్వతమ్మ, అక్కతో కలిసి అచ్చంపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్లకు బస్సులో వచ్చింది. సుజాత ఎక్కిన బస్సులోనే ఎక్కి వారి వెంటనే వచ్చిన గోవిందు పిడుగురాళ్ల పట్టణం పోలీస్‌స్టేషన్ సమీపం వద్దకు రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గోవిందును పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని కొండమోడు లక్ష్మీ బార్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా హత్య చేసినట్లు గోవిందు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్‌ఐలు శివనాగరాజు, మోహన్‌లు ఉన్నారు.


