ఎంఈఓలు, హెచ్‌ఎంలపై ఒత్తిడి చేసిన టీడీపీ నాయకులు ఎస్‌ఎంసీ ఎన్నికల్లో తమ వారే గెలవాలని జోక్యం శావల్యాపురం జెడ్పీ పాఠశాలలో వైఎస్సార్ సీపీ నేతలపై దాడి తిమ్మాపురంలో ప్రత్తిపాటి, పావులూరి వర్గాల ఘర్షణ తిమ్మాపురంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు కిడ్నాప్ గామాలపాడులో యరపతినేని, జంగా వర్గాల మధ్య వివాదం జిల్లాలో రసాభాసగా మారిన ఎస్‌ఎంీసీ ఎన్నికల ప్రక్రియ
ప్రత్తిపాటి వర్సెస్ పావులూరి
జిల్లాలో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల్లో సైతం ‘పచ్చ’ పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విద్యావ్యవస్థలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన కమిటీలను వారు తమ ఆధిపత్యం చెలాయించేందుకు లక్ష్యంగా చేసుకున్నారు. తమ అనుయాయుల పేర్లు ఖరారు చేయాలని, తాము సూచించిన వారే ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్‌చైర్మన్‌గా నియామకం కావాల్సిందేనంటూ దౌర్జన్యానికి దిగారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు పలు చోట్ల వారి దాడులతో ఉద్రిక్తతకు దారితీశాయి.
సత్తెనపల్లి/ నరసరావుపేట ఈస్ట్: జిల్లాలో 1,556 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహించేందుకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని 1,205 ప్రాథమిక, 54 ప్రాథమికోన్నత, 297 ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది.
మంగళవారం ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పచ్చనేతలు ప్రభుత్వ పాఠశాలల వద్దకు చేరుకొని తమకు అనుకూలంగా నిర్వహించాలంటూ మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి చేశారు. తమను కాదని వేరొకరిని నియమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ దౌర్జాన్యాలకు దిగారు. ఇలా మెజార్టీ స్ధానాలు పచ్చ నేతలు తమ ఖాతాలో వేసుకున్నారు. జిల్లాలో చాలా చోట్ల టీడీపీ నేతలు ప్రభుత్వ పాఠశాలల వద్దకు వచ్చి బహిరంగంగా బెదిరింపులు, హెచ్చరికలు, దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేశారు. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను చైర్మన్లుగా ఎన్నిక చేసుకున్నారు. కొన్ని పాఠశాలల వద్ద పోలీసులు ఉన్నప్పటికీ కనీస భద్రతా చర్యలు కూడా చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
22 చోట్ల వాయిదా
జిల్లా వ్యాప్తంగా 13 ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత, 8 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 22 పాఠశాలల్లో ఎన్నికలు వివాదాలతో ఆగిపోయాయి. వీటిలో తగిన కోరం లేక 16 చోట్ల వాయిదా పడ్డాయి. 6 చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసినట్లు డీఈవో రామారావు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ అనుమతితో మళ్లీ 22 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.
దాడులు.. దౌర్జన్యాలు
జిల్లాలో ఎస్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల తీరుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దాచేపల్లి మండలం గామాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ పదవి కోసం గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యుడు జంగా కృష్ణమూర్తి వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. జంగా కృష్ణమూర్తి వర్గానికి అనుకూలంగా పరిస్థితి ఉండటంతో ఎన్నికను వాయిదా వేశారు.
యడ్లపాడు మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో చిలకలూరిపేట శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు వర్సెస్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు వర్గాల మధ్య వివాదం రేగింది. అది కాస్తా ఘర్షణకు కూడా దారి తీసింది. ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరావు కిడ్నాప్‌తో ఎన్నిక వాయిదా వేశారు.


