తేలని ముని్సపల్‌ కేసుల పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

తేలని ముని్సపల్‌ కేసుల పంచాయితీ

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

తేలని ముని్సపల్‌ కేసుల పంచాయితీ

జిల్లా కేంద్రంలోని మున్సిపాల్టీకి ఈసారి ఎన్నికలు హుళక్కే తేలకపోయినా.. ఎన్నికలు జరుగుతాయంటున్న అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూపులు చైర్మన్‌ పదవిపై సీఎం సామాజిక వర్గం దృష్టి చైర్మన్‌ పదవి కోసం జనసేనలో చేరిన కాపు నాయకుడు ఆర్యవైశ్యుల ఆశలకు ఈసారి గండి పడినట్లే

చైర్మన్‌ పదవిపై సీఎం సామాజికవర్గం చూపు

నరసరావుపేట: సుమారు వందేళ్లకుపైగా చరిత్ర కల్గిన నరసరావుపేట పురపాలకసంఘ ఎన్నికల నిర్వాహణపై హైకోర్టులో దాఖలైన కేసుల పంచాయితీ ఇంకా తేలలేదు. దీంతో ఈసారి కూడా ఎన్నికలు జరగటం హుళక్కేనా..అనే ప్రశ్న ప్రజలలో తలెత్తుతుంది. 2021లో జరగాల్సిన ఎన్నికలు కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. అప్పుడు వార్డుల పునర్విభజన, పంచాయతీల విలీనం, ఓటర్ల మార్పులు, చేర్పులపై కోర్టులో పదికి పైగా కేసులు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా టీడీపీ వారు వేసినవే. ఒక్కటి మినహా దాదాపుగా అన్నీ కేసులు విత్‌డ్రా చేసుకున్నారు. ఆ ఒక్కటి ఎప్పుడు విత్‌డ్రా అవుతుందనే దానిపై అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద సమాధానం లభించట్లేదు. ఆ కేసు అలా ఉండగానే ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ కేసు తేలితేనే ఎన్నికలు జరుగుతాయంటూ కొంతమంది అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అక్టోబరు చివరినాటికి మొదటి ఫేజ్‌ ఎన్నికలకు సమాయుత్తమౌతుంది. అయితే సర్‌ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాతోనా లేక తర్వాత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తారా అనే దానిపై హైకోర్టు తీర్పును బట్టి ఎన్నికలు నిర్వహిస్తారు. సుమారు 1.46లక్షల జనాభా కలిగి స్పెషల్‌ గ్రేడ్‌గా ఉన్న స్థానిక పురపాలకసంఘానికి ఎన్నికలు నిర్వహించాలంటే తప్పనిసరిగా 48 వార్డులుగా విభజించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీల ఓటర్లు ఎంతమందో లెక్క తేల్చేందుకు ఎన్యూమరేషన్‌ జరగాల్సిన పరిస్థితి ఉంది. పెరిగిన వార్డులను బట్టి పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సివుంది. ఇంతపని జరగాల్సివుంది. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తనను వివరణ కోరగా ఒక కేసు విత్‌డ్రా కావాల్సివుందని, అయితే ఆ కేసుపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదన్నారు. అందువలన ఎన్నికలకు సంసిద్దం కావాలంటూ ఎన్నికల సంఘం సూచించిందన్నారు. దీనిపై మున్సిపల్‌ ఉన్నతాధికారుల ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. దానిని బట్టి వార్డుల పునర్విభజన, పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు, ఎన్యుమరేషన్‌ చేయిస్తామన్నారు. అందువలన రెండో ఫేజ్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవికి నేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ముఖ్యమంత్రి సామాజిక వర్గీయులు ఆ పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బీసీ కావటంతో అధికారం చెలాయించేందుకు అవకాశం, నియోజకవర్గంపై పట్టులేక ఆ వర్గ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారం తమదైనా ఇక్కడ చెలాయించే అవకాశం ఎమ్మెల్యే ఇవ్వకపోవటంతో వారంతా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో సగం జనాభాతో నిండిన మున్సిపాల్టీ చైర్మన్‌ పదవిని చేజిక్కించుకుంటే అధికారం తమదే అవుతుందని ఆ వర్గీయులు భావిస్తున్నారు. అయితే చైర్మన్‌ పదవి రిజర్వేషన్‌ కాకుండా పార్లమెంటు సభ్యులు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే పదవిపై దృష్టిపెట్టిన ఓ కాపు నాయకుడు ఇటీవలనే ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయన ఆశలు ఏమౌతాయో చూడాల్సివుంది. అదే విధంగా గత ఎన్నికల్లో చైర్మన్‌ పదవి ఆర్యవైశ్యులకు దక్కింది. ఈసారి కూడా పట్టణంలో అత్యధిక ఓటర్లుగా ఉన్న తమకే చైర్మన్‌ గిరి దక్కాలని ఆ వర్గీయులు ఎంతో ఆశతో ఉన్నారు. కూటమి తరపున ఏ వర్గానికి చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement