మంగళగిరి టౌన్: గుంటూరు బీఆర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ తైక్వాండో అండర్–14, అండర్–17 బాలబాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో మంగళగిరి అమరావతి తైక్వాండో క్లబ్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు, తైక్వాండో కోచ్ దుర్గాప్రసాద్ వివరాలు వెల్లడించారు. అండర్–14 విభాగంలో జె. లీలామనోహర్, ఎస్‌కే దనీష్ హుస్సేన్, టి.మనస్విని శ్రీ , పి.రాధిక, వి.భువి, అండర్–17 విభాగంలో కె.ప్రేమ్ రూపేష్, జి.హృతి హాసిని, ఎం.గేయ అక్షిత అర్హత సాధించారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు అక్టోబర్ 10 వ తేదీ నుంచి అనంతపురంలో జరగనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ కార్యదర్శి వినయ్‌కుమార్, ఉమ్మడి గుంటూరు జిల్లా తైక్వాండో సంఘం జనరల్ సెక్రటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల: విజయపురి సౌత్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్ నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర చేసి అద్భుతం సృష్టించాడు. నెల క్రితం విజయపురిసౌత్‌కు చెందిన సయ్యద్ సిరాజ్ హైదరాబాద్ నుంచి తన యాత్రను ప్రారంభించాడు. దేశభక్తి, మానవత్వం, సమాన విద్య, అందరికీ వైద్యం, నేపాల్‌తో స్నేహం వంటి సందేశాలతో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని సొంత ఖర్చుతో యాత్ర పూర్తి చేశారు. కష్టమైన మార్గాల్లో ముందుకు సాగి యాత్రను విజయవంతంగా ముగించారు.
అమరావతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకట హర చతుర్థ్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి ఆలయ అర్చకుడు జగర్లపూడి శేష సాయిశర్మ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల ఫుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండ్రాళ్లను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విద్యుత్ సరఫరా మరింత మెరుగుకు కృషి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటుగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తి చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని నగరంలోని గవర్నరుపేట, ఆర్‌ఆర్ పేటల్లో జరుగుతున్న విద్యుత్ ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యతాప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికిషోర్‌తో పాటుగా ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.


