ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ ముగిసిన అమరావతి చాలెంజర్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ఆంధ్రా ఎల్లో జట్టు
పెదకాకాని: క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. పెదకాకాని మండలం కొప్పురావూరు పరిధిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల అమరావతి చాలెంజర్స్ అంధుల క్రికెట్ ట్రోఫీ, ఆంధ్ర జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ క్రీడాకారుల త్యాగం అభినందనీయమన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత, బ్లైండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఐ. అజయ్‌కుమార్‌రెడ్డి సేవా నిరతిని కొనియాడారు. ఇంకా నాలుగేళ్ల కెరీర్ ఉన్నప్పటికీ, రాబోయే తరం క్రీడాకారులకు అవకాశం కల్పించేందుకు అజయ్‌కుమార్ నిస్వార్థంగా త్యాగం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. అజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ ఆత్మవిశ్వాసం, పట్టుదల, దృఢ సంకల్పంతో ఆడే ఆట అన్నారు. జి. రవీంద్రబాబు మాట్లాడుతూ ఎంఎస్‌కె ప్రసాద్ క్రికెట్ గ్రౌండ్‌ను ఈ టోర్నమెంట్ నిర్వహణకు అందుబాటులో ఉంచారన్నారు. ఉత్సాహభరితంగా సాగిన ఫైనల్స్‌లో ‘ఆంధ్రా ఎల్లో’ జట్టు విజేతగా నిలవగా.. ఆంధ్రా రెడ్, ఆంధ్రా బ్లూ జట్లు రన్నరప్‌లుగా నిలిచాయి. విజేత జట్లకు రవికృష్ణ ట్రోఫీలు, బహుమతులను అందజేశారు. ఇండియన్ ఆంధుల జట్టుకు ఎంపికై న ఆంధ్రా ఆటగాళ్లు దుర్గారావు, రవి, వెంకటేష్, అశోక్‌రెడ్డిలను బంగ్లాదేశ్‌లో జరిగే పోటీల్లో ఇండియా జెండా రెపరెపలాడేలా ప్రతిభ కనపరచాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో గుంటూరు ఈగల్ సీఐ విక్టర్, ఎస్‌ఐలు సునీల్‌బాబు, రాజశేఖర్, సిబ్బంది, క్రీడాకారులు, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.


