అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
నరసరావుపేట: ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనులను పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా డిస్ట్రిక్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జల్‌జీవన్ మిషన్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో రూ.240.34 కోట్ల అంచనాతో మొత్తం 604 పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇందులో 368 పనులు పూర్తికాగా, 231 పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఐదు పనులు ఇంకా ప్రారంభం కాలేదని వివరించారు. డిసెంబర్ 31 నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ గుత్తేదారులు పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసిన తర్వాత రహదారులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికి పూర్తిస్థాయిలో కొళాయిలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర నాయక్, ఏడీ అగ్రికల్చరల్ జగ్గారావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రాజేంద్రప్రసాద్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఈఈ మనోహర్‌బాబు, డీఎల్‌డీఓలు ఎం.వెంకటరెడ్డి, ఉమాదేవి, గబ్రూ నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు రత్నబాబు, హరినాథ్‌బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో యథావిధిగా పింఛన్లు పంపిణీ
నరసరావుపేట: జిల్లాలో యథావిధిగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బ్యాంక్ ఉద్యోగులు 28, 29, 30 తేదీల్లో సమ్మె చేస్తామని ప్రకటించగా, అక్టోబర్ ఒకటో తేదీన ఉదయం డబ్బులు డ్రా చేసి మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. కానీ బ్యాంకు ఉద్యోగులు సమ్మె విరమించటంతో ప్రస్తుతం బ్యాంకులు యథావిధిగా కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. కావున ఈ నెల 30వ తేదీన అధికారులు నగదు డ్రా చేసి, అక్టోబర్ ఒకటవ తేదీన ఏడు గంటల నుంచి పింఛన్లు పంపిణీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
పాత ప్రభుత్వ వైద్యశాలను
హెల్తె కాంప్లెక్స్‌గా మార్చాలి
పల్నాడురోడ్డులోని పాత ప్రభుత్వ వైద్యశాలను వివిధ వైద్య విభాగాల ఆఫీసులతో ఒక హెల్త్ కాంప్లెక్స్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జిల్లా వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం ఈ ప్రాంగణంలో జిల్లా వ్యాక్సిన్ స్టోర్ (డీవీఎస్) ఏర్పాటుకోసం స్థలం పరిశీలించేందుకు వచ్చారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కె.హనుమకుమార్, ఇతర విభాగాల జిల్లా అధికారులతో కలిసి పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పాత హాస్పిటల్‌ను వైద్య విభాగానికే వినియోగించాలని జిల్లా అధికారులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ భవన సముదాయాన్ని ఎటువంటి పరిస్థితుల్లోను ఖాళీగా ఉంచవద్దని, ఆర్‌టీసీ బస్టాండ్ వెనుకవైపు ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న ఎన్‌టీఆర్ ఆరోగ్యశ్రీ, మరోచోట కొనసాగుతున్న ఏపీఎంఎస్‌ఐడీపీ కార్యాలయాలను కూడా ఇక్కడకు తీసుకురావాలని సూచించారు.


