నరసరావుపేట కేంద్రంగా పెరుగుతున్న విష సంస్కృతి
యువతపై
ప్రభావం
మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు
విచ్చలవిడిగా పట్టణంలో వ్యభిచార కేంద్రాలు
రావిపాడు రోడ్డు స్పా సెంటర్‌పై వన్‌టౌన్ పోలీసుల దాడి
ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తి అరెస్ట్
మంత్రి సమీప బంధువుగా చెప్పుకొంటూ నిర్వాహకుడి దందా
ఉపేక్షించేది లేదు
ఏడాదిగా...
రాష్ట్రంలో సింగపూర్ తరహా అభివృద్ధి ఏమోగానీ, పల్నాడుకు మాత్రం ఎన్నడూ లేని థాయ్‌లాండ్ సంస్కృతిని తీసుకొచ్చారు. పరిశ్రమల స్థాపన ఏమోగానీ, మసాజ్ సెంటర్లకు వేదిక చేశారు. యువతకు ఉద్యోగాల కల్పన ఏమోగానీ, బంగారంలాంటి భవిష్యత్తును వ్యసనాల ఊబిలోకి నెడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు స్పా ముసుగు కప్పి జేబులు నింపుకొంటున్నారు. గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఓ స్పా గుట్టును వన్‌టౌన్ పోలీసులు రట్టు చేశారు.
నరసరావుపేట టౌన్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఇప్పటికే లాటరీ, బెట్టింగ్, రేషన్ మాఫియా వంటి అక్రమాలతోపాటు చీటింగ్, యానిమేషన్ వంటి స్కాములకు అడ్డాగా గుర్తింపు పొందింది. తాజాగా మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు వేదికై ంది. ఈ ధోరణి ఇలానే కొనసాగితే విద్యా, వైద్య కేంద్రంగా పేరుపొందిన నరసరావుపేట అసాంఘిక కార్యకలాపాలకు హబ్‌గా మారే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో అనధికారంగా నాలుగు స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వాటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం రావిపాడు రోడ్డులోని ఓ స్పా సెంటర్‌లో వన్‌టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
నిర్వాహకుడి కోసం గాలింపు..
అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి సమీప బంధువు అని చెప్పుకొంటూ నరసరావుపేటలో స్పా ముసుగులో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రావిపాడు రోడ్డులో పట్టుబడ్డ మహిళలు, పురుషుడు ఇచ్చిన సమాచారంతో కేసులో అతను ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. నరసరావుపేట, వినుకొండ, గుంటూరు ప్రాంతాల్లో ఇతనికి స్పా సెంటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఓ మంత్రికి బంధువు అని చెప్పుకుంటూ స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. నరసరావుపేటలో గత ఏడాది నుంచి మంత్రి పేరు చెప్పి పోలీసులను సైతం స్పా పక్కకు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. స్థానికుల నుంచి పోలీస్ ఉన్నతాధికారులకు అధిక ఫిర్యాదులు అందటంతో ఎట్టకేలకు దాడులు నిర్వహించారు. నామమాత్రపు కేసు నమోదు చేయడంతో తిరిగి స్పా సెంటర్ కొనసాగుతుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అభివృద్ధి చెందడమేమోగానీ, థాయ్‌లాండ్ తరహాలో మసాజ్ సెంటర్లు పట్టణ నలుదిక్కులా వెలిశాయి. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రావిపాడు రోడ్లతోపాటు ఎల్‌టీ నగర్, సాయినగర్‌లలో స్పా సెంటర్లు ఏర్పాటు చేశారు. స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు గతేడాదిగా కొనసాగుతున్నాయి. దీంతో పాటు పలు లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. వలపు వల వేసి జేబులు గుల్ల చేస్తున్నారు. ఒక్కో స్పా సెంటర్‌లో గంటల ప్రకారం రూ.వేల ధరలు నిర్ణయించారు. వీటితోపాటు వ్యభిచార కూపంలోకి లాగి యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో ప్రత్యేకమైన గదులు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
నరసరావుపేట పట్టణంలో మూడు అనధికార స్పా సెంటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. రావిపాడు రోడ్డులోని స్పా సెంటర్‌పై తనిఖీలు చేపట్టి, ఓ వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశామన్నారు. మగవారికి మహిళలతో మసాజ్‌లు చేయిస్తున్నట్లు గుర్తించామన్నారు. స్పా ముసుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎం. హనుమంతరావు,
నరసరావుపేట, డీఎస్పీ
నియంత్రణ లేకుండా నడిచే స్పా కేంద్రాలు యువతను ఆకర్షించే ప్రమాదం ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారితే పరిసర ప్రాంతాల్లో అసౌకర్యం, కుటుంబాల్లో విభేదాలు, మహిళల భద్రతపై ఆందోళనలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగితే వాటికి సంబంధించిన వ్యక్తులు, మధ్యవర్తులు, నిర్వాహకులపై పోలీసుల నిఘా అవసరం. మైనర్లతో పనులు, మానవ అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం వంటి అనర్థాలు చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదు. యువతలో వ్యసనాలు పెరిగిపోయి, ఆ ప్రభావం సమాజంపై పడుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.


