తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న శుక్రవారం సందర్శించారు. విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు, అత్యవసర సమయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రం నుంచి తుఫాన్లు, వరదలు, పిడుగుపాట్లు తదితర విపత్తులను అంచనా వేయడం, క్షేత్రస్థాయిలో ముందస్తుగా హెచ్చరికలను ఏ విధంగా పంపుతారో విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో ఆయనకు వివరించారు. అనంతరం కమిషనర్ ఆదెన్న మాట్లాడుతూ విపత్తు హెచ్చరికలు, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన కీలక వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మాధ్యమాలు, అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతోందని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఏఓ రవిబాబు, ఎన్ఈఓసి ఇన్‌ఛార్జి పీటర్, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 23న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్‌లో గుంటూరు జిల్లా అథ్లెటిక్ ఎంపికలు అండర్ –14, 16, 18, 20 బాలబాలికలు విభాగంలో జరుగుతాయని జిల్లా సంఘం కార్యదర్శి జీ వీ.ఎస్. ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ఆదోనిలో జరిగే ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకొని ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్ లో రిపోర్ట్ చేయాలని కోరారు.
పొగాకు బోర్డు ఈడీకి రైతు సంఘాల వినతి
లక్ష్మీపురం: వర్జీనియా పొగాకు రైతుల వద్ద మిగిలిన సరుకును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. శుక్రవారం భారత పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు విశ్వశ్రీని కలిసి వినతిపత్రం అందజేశారు. మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 30 శాతం ఎఫ్‌సీవీ పొగాకు రైతులు తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవాల్సి వస్తోందని తెలిపారు. మిగిలిన పొగాకును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల ఆర్థిక సాయాన్ని వాస్తవ సాగుదారులైన ఎఫ్‌సీవీ రైతులకు ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని ఈడీని కోరారు. సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు ఈడీ తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డె హనుమారెడ్డి, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీవీ జగన్నాథం, రైతు కూలీ సంఘం నాయకులు పరిటాల కోటేశ్వరరావు, అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె.హనుమంతరావు, కనపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి రూరల్: మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ (డబ్లూఎపీఎల్–2026) టోర్నమెంట్ ప్రారంభం కానున్నది. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా నారా బ్రాహ్మణి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్ స్టార్ జట్టుకు, గోదావరి గోల్డెన్ ఈగల్ జుట్టు మధ్య మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 6.30 గంటలకు వైజాగ్ ఫైబర్స్ జట్టు, అమరావతి జాబ్స్ జట్టు మధ్య మ్యాచ్ జరగనుంది.


