చిలకలూరిపేట టౌన్: బాణసంచా దుకాణంలో తనిఖీ చేస్తుండగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో దుకాణంలో పనిచేస్తున్న వారిలో ఒకరు బయటకు పరుగులు తీసి ప్రమాదం నుంచి తప్పించుకోగా.. యజమాని బి.సురేష్‌తో పాటు గుమస్తా మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే చిలకలూరిపేటకు చెందిన కె.ఎస్.ఎస్. ఫైర్‌వర్క్స్ హోల్‌సేల్ దుకాణంలో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా దుకాణంలో పనులు జరుగుతున్న సమయంలో సింగిల్‌షాట్ తారాజువ్వను యజమాని కుమారుడు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అది బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతంపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో దుకాణంలో ఉన్న యజమాని కౌంటర్లోంచి బయటకు దూకాడు. అప్పటికే అతని ఒంటికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. బయటే ఉన్న వాచ్‌మెన్ మస్తాన్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా కాలిబూడిద కాగా, రెండు స్కూటీలు, బైక్, వాచ్‌మెన్ సైకిల్ దగ్ధమయ్యాయి. ప్రమాద తీవ్రతతో అక్కడ కొద్దిసేపు భయానక వాతావరణం నెలకొంది. సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ అన్వేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రూరల్ ఎస్‌ఐ జి .అనిల్‌కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. 108 వాహనంలో క్షతగాత్రులను తొలుత చిలకలూరిపేటకు తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఫైర్ సేఫ్టీ డీజీ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది చేరుకుని గంటకుపైగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.


